బూర నర్సయ్యగౌడ్
మునుగోడు: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక విషయంలో జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి నాయకులందరినీ కలుపుకొనిపోవడంలేదని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడు లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పక్క నియోజకవర్గాల నాయకులను పిలిపించుకొని నెలరోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్‌ఎస్ పార్టీ సమావేశాలు, సభలు నిర్వహిస్తున్నారు.
వీటి సమాచారాన్ని మాకు ఇవ్వడంలేదు. ఎందుకు అలా చేస్తున్నారో మంత్రి సమాధానం చెప్పాలి’అని అన్నారు. నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గం బలంగా ఉందని, అందుకే టీఆర్‌ఎస్ పార్టీలో ఎంతోకాలంగా పనిచేస్తున్న బీసీ నాయకులం ఈ ఉపఎన్నికలో బీసీలకు టీఆర్‌ఎస్ టికెట్ ఇస్తే బాగుండని భావిస్తున్నామన్నారు. అది సీఎం కేసీఆర్ నిర్ణయమని, తనకు టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీ కోసం, మునుగోడు అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని అన్నారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థి పేరును ఇప్పట్లో ప్రకటించరని, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాతే సీఎం కేసీఆర్ వెల్లడిస్తారని చెప్పారు. మునుగోడు ఉపఎన్నికతోనే రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉందని, అందువల్ల అందరం ఐక్యంగా పనిచేసి అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 33 మహిళా కళాశాలల్లో ఒకదానిని మునుగోడులో ఏర్పాటు చేయాలని నర్సయ్యగౌడ్ కోరారు. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ చలువతోనే ఈ నియోజకవర్గంలోని చౌటుప్పల్‌లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయించామని, రానున్న రోజుల్లో రీజినల్ రింగ్‌రోడ్డు కూడా మునుగోడు నుంచి వెళ్తుందని, దీంతో ఊహించని రీతిలో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment