ముంబై: తాను అడిగితేనే శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ఉండటానికి అంగీకరించారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. వ్యక్తిగతంగా షిండేతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి రెండు రోజుల ముందే షిండేతో భేటీ అయ్యానని, అప్పుడే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండేందుకు అంగీకరించారని వెల్లడించారు. ఓ జాతీయ మీడియాకు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. 11 రోజుల ఉత్కంఠకు తెరదీస్తూ ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో ఫడ్నవీస్ ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జరిగిన మహాయుతి తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రి బీజేపీ నుంచి ఉండేందుకు షిండే అంగీకరించారని ఫడ్నవీస్ పేర్కొన్నారు. ‘అయితే షిండే ప్రభుత్వంలో భాగం కాకూడదని, కూటమి సజావుగా సాగేందుకు సమన్వయ కమిటీకి నేతృత్వం వహించాలని శివసేనలోని ఒక వర్గం భావించింది. తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రి కావాలని శివసేన నేతలు కోరుకునేవారు. కానీ, మా మనసులో ఎలాంటి సందేహం లేదు. వ్యక్తిగతంగా షిండేతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నేను ఆయనను కలిసిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండటానికి అంగీకరించారు’ అని తెలిపారు.
అయితే గత ప్రభుత్వంలో రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగిన షిండే.. డిప్యూటీ సీఎం బాధ్యతలను తీసుకునేందుకు నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేందుకు షిండే అంగీకరించడంతో ఆ ఊహాగానాలకు చెక్ పడింది.
Comments
Please login to add a commentAdd a comment