సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అన్నదాతల ఆక్రందనలు, కౌలు రైతుల కష్టాలకు కారణం బీఆర్‌ఎస్ పార్టీయేనని కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే అన్నదాతల సంక్షేమానికి సమగ్ర చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రైతుల కోసం చేపట్టే అంశాలను ఈ నెల 27న ఖమ్మంలో పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనే సభలో ప్రకటించనున్నట్లు తెలిపారు. ‘రైతు గోస, బీజేపీ భరోసా’పేరుతో నిర్వహించే ఈ బహిరంగ సభ ద్వారా రైతుల పట్ల బీజేపీ ఎలాంటి వైఖరి అనుసరించనుందో ప్రకటిస్తామన్నారు.
గురువారం బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్నేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలతో రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోయినా, బీఆర్‌ఎస్ సర్కార్ నుంచి వారికి ఏ మాత్రం మేలు జరగలేదని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు రైతు బంధు మాత్రమే పరిష్కారం కాబోదని కిషన్‌రెడ్డి చెప్పారు.
రైతాంగాన్ని మోసం చేస్తున్న కేసీఆర్ సర్కారుకు, కౌలు రైతుల కష్టాలను అర్థం చేసుకోలేని కల్వకుంట్ల కుటుంబానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రైతు రుణమాఫీని తెరపైకి తెచ్చి రైతులను ఆగమాగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణ రైతులను ఆదుకునేందుకు కేంద్రం అన్నివిధాలా ప్రయత్నిస్తోందని కిషన్‌రెడ్డి చెప్పారు.
ఢిల్లీలో ఒక మాట... గల్లీలో మరో మాట
మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే నైతికహక్కు కల్వకుంట్ల కుటుంబానికి లేదని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఢిల్లీలో ఒక మాట.. గల్లీలో ఒక మాట మాట్లాడి కల్వకుంట్ల కుటుంబం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని దుయ్యబట్టారు. మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేని, గతంలో మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన ఘనత కల్వకుంట్ల కుటుంబానిదేనని ధ్వజమెత్తారు.
చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతం కావడం 140 కోట్లమంది భారతీయులకు గర్వకారణమన్నారు. కేంద్రం ప్రకటించిన 69వ జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు సినిమా సత్తాచాటిందని చెప్పారు. అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ నటుడి అవార్డుకు ఎంపికవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆరు అవార్డులు ‘ఆర్‌ఆర్‌ఆర్’చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment