మధురపూడి: తూర్పు గోదావరి జిల్లాలో జనసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో రాజానగరం నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేసిన మేడా గురుదత్త ప్రసాద్ సహా 100 మంది ఆ పార్టీకి రాజీనామా చేశారు. కోరుకొండలో ఆదివారం ఆయన మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం గురించి మాట్లాడే జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్.. ఆ పార్టీలో ఉన్న వారికి కూడా ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఉంటాయన్న విషయం తెలుకోలేకపోవడం బాధాకరమని, ఈ కారణంగానే తాను పార్టీని వీడాల్సి వచ్చిందని గురుదత్త ప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రజారాజ్యం, తరువాత జనసేన పార్టీలో కలిపి 16 ఏళ్లు అంకితభావంతో పనిచేశానని చెప్పారు. పార్టీలో ఒంటెద్దు పోకడలు నెలకొన్నాయని, అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడిందని, ఈ కారణంతోనే మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణతోపాటు తోట చంద్రశేఖర్, అద్దేపల్లి శ్రీధర్, రాజురవితేజ, జయలలిత వద్ద చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రామ్మోహన్ సహా 11 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ అధికారులు జనసేనకు గుడ్‌బై చెప్పారని గుర్తుచేశారు. వారితో పోలిస్తే తాను చాలా చిన్నవాడినన్నారు.
తనను నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి నుంచి తప్పిస్తున్నట్లు తనకు తెలియజేయలేదని, అధిష్టానం అపాయింట్‌మెంట్ కోసం 87 రోజులుగా వేచి చూశానని.. చివరకు ఈ అవమానం భరించలేక రాజీనామా చేస్తానని గత నెల 30న లేఖ రాసినప్పటికీ ఎవ్వరూ స్పందించలేదన్నారు. పార్టీ అధ్యక్షుడు పవన్ తీరు కారణంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గురుదత్త ప్రసాద్ తెలిపారు.
ఆయనతో పాటు జనసేన కోరుకొండ మండలాధ్యక్షుడు మండపాక శ్రీను, రాజానగరం మండలాధ్యక్షుడు బత్తిన వెంకన్నదొర, ఉపాధ్యక్షుడు నాగారపు భానుశంకర్, నాయకులు అడబాల సత్యనారాయణ, కొచ్చెర్ల బాబీతోపాటు 100 మంది జనసేనకు గుడ్‌బై చెప్పారు. త్వరలో మరికొందరు కూడా రాజీనామా చేస్తారని మేడా తెలిపారు. స్థానిక నాయకత్వం వన్‌మ్యాన్ షోలా వ్యవహరించడం, ఇతర సమస్యల కారణంగా రాజీనామాలు తప్పవన్నారు. ఏ పార్టీలో చేరేదీ త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment