సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలిరోజు గురువారం మాజీ మంత్రి హరీశ్‌రావుకు అసెంబ్లీలో వింత అనుభవం ఎదురైంది. బీఏసీ సమావేశానికి హాజరయ్యే విషయంలో ఏర్పడిన గందరగోళంపై హరీశ్‌రావు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.
‘గతంలో లేని సంప్రదాయాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తోంది. జాబితాలో పేర్లు ఉన్న వారు మాత్రమే బీఏసీ సమావేశానికి రావాలని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అంటున్నారు.
కడియం శ్రీహరితో పాటు హరీశ్‌రావు బీఏసీకి వస్తారని నిన్ననే స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ఎల్పీ లీడర్ కేసిఆర్ తెలియజేశారు. స్పీకర్ రమ్మన్నారు కాబట్టే వెళ్ళాను. ఒక్క ఎమ్మెల్యే ఉన్న సీపీఐని బీఏసీ సమావేశానికి పిలిచారు’ అని హరీశ్‌రావు మీడియాకు తెలిపారు.
అంతకుముందు బీఏసీ సమావేశానికి వెళ్లిన హరీశ్‌రావు సమావేశం మధ్యలో నుంచే బయటికి వచ్చేశారు. జాబితాలో పేరున్న కేసీఆర్‌కు బదులుగా పేరున్న హరీశ్‌రావు బీఏసీకి వెళ్లారు. హరీశ్‌రావు బీఏసీ సమావేశానికి రావడంపై శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం తెలపడంతో హరీశ్‌రావు మధ్యలోనే బయటికి వచ్చినట్లు తెలిసింది.
దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. తాము ఎవరినీ వ్యక్తిగతంగా బీఏసీ నుంచి బయటికి వెళ్లమని కోరలేదన్నారు. స్పీకర్ నిర్ణయం మేరకే బీఏసీ నడిచిందని, పార్టీల నుంచి ముందుగా ప్రతిపాదించిన సభ్యులే బీఏసీకి రావాలని స్పీకర్ కోరారని చెప్పారు. జాబితాలో పేరున్న కేసీఆర్‌కు బదులుగా హరీశ్‌రావు వస్తారని బీఆర్‌ఎస్ తెలిపిందన్నారు.
గవర్నర్ ప్రసంగంలో గ్యారెంటీల జాడ లేదు
అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగంపై అసెంబ్లీ మీడియా పాయింట్‌లో హరీశ్‌రావు స్పందించారు. ఒక విజన్‌లా ఉండాల్సిన గవర్నర్ ప్రసంగం అందరినీ నిరాశపరిచిందన్నారు. వచ్చే ఏడాది ప్రభుత్వం ఏం చేస్తుందో గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా లేదని విమర్శించారు.
‘కొత్త ఆసరా పెన్షన్‌లు, మహిళలకు నెలకు రూ. 2500 ఎప్పుడిస్తారో తెలియని ప్రసంగం నిరాశపరిచింది. రైతులకు బోనస్, రైతు బంధు ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు. నిరుద్యోగ భృతి ప్రస్తావన లేనేలేదు. ప్రజావాణి కార్యక్రమం తుస్సుమంది.
మంత్రులు, ఐఏఎస్‌లు తీసుకోవాల్సిన అప్లికేషన్లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీసుకుంటున్నారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పినట్టు 2 గ్యారెంటీలు అమలవ్వడం లేదు. త్వరలో ఎన్నికల కోడ్ అమలవనుంది. అప్పుడు ఈ కొత్త హామీలు ఎలా అమలు చేస్తారు’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment