
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి రాగానే రైతుబంధును పెంచిన డబ్బు (ఎకరాకు రూ. 5 వేల బదులు రూ. 7,500)తో రైతుల ఖాతాల్లో వేస్తామన్న మాటేమైందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో డిసెంబర్ 9న రైతుబంధు సొమ్మును రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పారని, ఇచ్చిన మాటపై రైతులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరులతో హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రభు త్వంపై విమర్శలు చేయట్లేదని... దీనిపై ప్రజలు, రైతులపక్షాన ప్రభుత్వాన్ని అడుగుదామని వచ్చామన్నారు. ఎకరాకు ఏటా రూ. 15 వేలు అంటే.. యాసంగి పంటకు ఎకరానికి రూ. 7,500 చొప్పున ఇవ్వాలన్నారు.
యాసంగి పంట పనులు ప్రారంభమయ్యాయని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతుబంధు ఎప్పటి నుంచి వేస్తారో రైతులకు చెప్పా లని కోరారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం యాసంగి పంటకు నవంబర్ చివరివారం లేదా డిసెంబర్ మొదటి వారంలో రైతుబంధు డబ్బు వేసేవాళ్లమని గుర్తు చేశారు. ప్రమాణస్వీకారం చేసిన ఎమ్మెల్యేలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
బోనస్‌తో పంటను కొనాలి..
రైతాంగం అంతా ప్రభుత్వం పంట ఎప్పుడు కొంటుందోనని ఎదురు చూస్తోందని హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారంలో రైతులను వడ్లు అమ్ముకోవద్దని చెప్పారని... అధికారంలో రాగానే రూ. 500 బోనస్‌తో వడ్లు కొంటామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. పంట మొత్తం కల్లాల్లో ఉందని, రైతులంతా కళ్లలో వత్తులేసుకొని ఎదురుచూస్తున్నారని, ఒకవైపు తుపాను ప్రభావంతో కొన్ని చోట్ల వడ్లు తడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రూ. 500 బోనస్ ఎప్పుడు ఇస్తారు? వడ్లు ఎప్పటి నుంచి కొంటారు’అని హరీశ్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment