సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి బూస్టర్ డోస్‌లా పనిచేస్తుందని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త మార్గాన్ని చూపుతుందని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ వెంట యాత్రలో పాల్గొన్న ఆయన శనివారం సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత్ జోడో యాత్ర తెలంగాణలో విజయవంతం అవుతోందని, అన్ని వర్గాల ప్రజల నుంచి స్పందన వస్తోందని తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఐక్యత ఎంతో అవసరమని రమేశ్ అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని, ఈ రెండు ప్రభుత్వాల పాలనలో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఎంఐఎం, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ, టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీలన్నీ కేంద్రంలోని బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, బీజేపీని గద్దెదించడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. రాహుల్ చేపట్టిన ఈ భారత్ జోడో యాత్ర ఎన్నికల యాత్ర కాదని రమేశ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment