సాక్షి, అమరావతి: ‘రాయలసీమకు చుక్క నీరు ఇవ్వం‘ అంటూ అమరావతి యాత్రికులు చేసిన వ్యాఖ్యల వెనుక చంద్రబాబు రహస్య అజెండా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. అమరావతి యాత్ర పేరుతో ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్న చంద్రబాబు బండారాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తేవాలన్నదే తన ఉద్దేశమన్నారు. అమరావతి పాదయాత్రలో వారు మాట్లాడిన మాటలు సీమ వాసిగా, ఆ ప్రాంత ప్రజా ప్రతినిధిగా తనను బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే, తాము మధ్యాంధ్రప్రదేశ్ పేరిట ఉద్యమించాల్సి ఉంటుందన్న వారి మాటల వెనుక కచి్చతంగా చంద్రబాబు ఉన్నారని అర్థమవుతోందన్నారు. శ్రీకాంత్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..
పసుపు కండువాలతో యాత్ర చేయండి
► కృష్ణా నది నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకు తెలుసా? శ్రీశైలం ప్రాజెక్టు కోసం మేము త్యాగం చేసి, మీకు నీళ్లు ఇస్తుంటే, రాయలసీమకు చుక్క నీరు ఇవ్వం అని విద్వేషాలు రెచ్చగొడతారా? రాయలసీమకు న్యాయ రాజధాని వస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టమేమిటో అర్థం కావడం లేదు.
► చంద్రబాబుకు అధికారమే పరమావధి. రాష్ట్ర విభజనకు మూల కారకుడయ్యారు. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలంటే చంద్రబాబుకు ద్వేషం. రైతుల ముసుగులో గ్రీన్ కండువాలు ఎందుకు.. పచ్చ కండువాలతో యాత్ర చేయండి. ఐదేళ్లు అధికారంలో ఉండి అమరావతిలో ఒక్క హోటల్ కట్టావా బాబూ? అక్కడ టీ తాగాలన్నా, భోజనం చేయాలన్నా దిక్కు లేదు. రాష్ట్రంలో అశాంతి, అలజడులు సృష్టిద్దామనుకుంటే చూస్తూ ఊరుకోం.
చంద్రబాబు కాలంలో నక్సలిజం, కరువు కాటకాలు
► 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు, రాష్ట్రాన్ని కరువు ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు. నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలో దిట్ట. ఆయన పాలన తొలి నాళ్లలో నక్సలిజం, కరువు కాటకాలు, క్షీణించిన శాంతిభద్రతలతో రాష్ట్రం తల్లడిల్లింది.
► దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ అధికారం చేపట్టాక, వాటన్నింటినీ చక్కదిద్ది రాష్ట్రానికి సరికొత్త దశ, దిశ నిర్ధేశిస్తూ, సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పారు. వ్యవసాయం దండగ అని బాబు అంటే.. కాదు పండుగ అని నిరూపించారు.
► రాష్ట్ర విభజన తర్వాత ప్రజలను మభ్యపెట్టి అధికారం చేపట్టిన చంద్రబాబు, ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయారు. దాని నుంచి తప్పించుకునేందుకు అమరావతి బాట పట్టారు. సినిమా సెట్టింగులు మాదిరిగా గ్రాఫిక్స్ చూపించి, డల్లాస్, సింగపూర్, మలేషియా చేస్తానని చెప్పి ప్రజలను మభ్య పెట్టారు. నిపుణుల మాటలను లెక్క చేయకుండా ఇక్కడి రైతులనూ మోసం చేశారు. ప్రజలు 2019లో అధికారం ఊడగొట్టినా బుద్ధి రాలేదు.
► హైదరాబాద్‌లో రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్ట్, సాఫ్ట్‌వేర్ అన్నీ తన ఘనతేనని చెప్పుకుంటారు. అవుటర్ రింగు రోడ్డు, ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేసి, ప్రారంభించిన నేత వైఎస్సార్. నేదురుమల్లి జనార్దనరెడ్డి హైటెక్ సిటీకి శంకుస్థాపన చేశారు. వైఎస్సార్ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి, జలయజ్ఞం పేరుతో 86 ప్రాజెక్టులు ప్రారంభించారు.
► శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో న్యాయ రాజధాని హక్కుగా రావాల్సి ఉన్నా దానికీ బాబు అడ్డుపడుతున్నారు. రాయలసీమ అంటే విషం కక్కుతున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, ఇతరత్రా అన్ని విషయాలపై అసెంబ్లీలో చర్చిద్దామంటే రాకుండా పారిపోతారు.
ఆ వ్యాఖ్యల వెనుక బాబు రహస్య అజెండా
Published Wed, Sep 14 2022 5:42 AM | Last Updated on Wed, Sep 14 2022 5:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment