సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ ఓ గంజాయి మొక్కని.. ద్వంద్వ నీతికి తాను నిలువెత్తు నిదర్శనమని చంద్రబాబు మరోసారి నిరూపించారు. గంజాయి స్మగ్లర్లకు టీడీపీ అండగా ఉంటుందని కూడా చేతల్లో చూపించారు. ఇందుకు సంబంధించిన ఓ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న.. పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన నరసరావుపేటకు చెందిన మానుకొండ జాహ్నవికి పార్టీలోకి తిరిగి ఎర్రతివాచి పరిచారు. తద్వారా గంజాయి స్మగ్లర్లకు టీడీపీ అడ్డా అని నిరూపించారు.
చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో నర్సీపట్నం కేంద్రంగా అప్పటి మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచర వర్గమే రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్‌ను యథేచ్ఛగా నిర్వహించింది. అధికారం కోల్పోగానే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఈ విషయంలో దుష్ప్రచారం చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు.. చంద్రబాబు తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఎందుకంటే.. 2013లో గంజాయి స్మగ్లింగ్ ముఠాపై అప్పటి హైదరాబాద్ పోలీసులు దాడిచేసి కేసు నమోదు చేశారు. ఆ కేసులో నిందితురాలిగా ఉన్న జాహ్నవిని తెలంగాణ పోలీసులు 2022 మేలో అరెస్టుచేశారు. దాంతో టీడీపీ బండారం బట్టబయలైంది. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. తుదితీర్పు వచ్చేవరకు ఈ సస్పెన్షన్ అమలులో ఉంటుందని కూడా చెప్పారు.
కానీ, జాహ్నవి మాత్రం టీడీపీలో క్రియాశీలంగానే కొనసాగుతోంది. అలాగే, ఆమెపై ఉన్న సస్పెన్షన్‌ను తొలగించాలని చంద్రబాబు తాజాగా నిర్ణయించారు. దీంతో జాహ్నవిపై ఉన్న సస్పెన్షన్‌ను తొలగిస్తున్నట్లు టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. కానీ, ఆమెపై ఉన్న స్మగ్లింగ్ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ పార్టీలో ఆమెపై సస్పెన్షన్‌ను తొలగించి టీడీపీలోకి ఆమెను తిరిగి ఆహ్వానించడం ద్వారా చంద్రబాబు తన నైజాన్ని మరోసారి చాటుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment