సాక్షి, చెన్నై: ఈరోడ్ తూర్పు నియోజవర్గం ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమా..? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకు సినీ నటి గాయత్రి రఘురాం సవాల్ విసిరారు. పోటీ చేస్తే, ప్రత్యర్థిగా తాను రంగంలోకి దిగుతానని స్పష్టం చేశారు. వివరాలు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన సినీ నటి గాయత్రి రఘురాం మధ్య జరుగుతున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నామలైను టార్గెట్ చేసి గాయత్రి తీవ్రంగా విరుచుకు పడుతున్నారు.
సోమవారం ట్విట్టర్ వేదికగా అన్నామలైకు ఆమె ఓ సవాలు విసిరారు. ఈరోడ్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుమగన్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం ప్రసుత్తం ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో ఉప ఎన్నికలకు కసరత్తు మొదలైంది. ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత ఈవీకేఎస్ కుటుంబం హవా నడుస్తుండటం, మరణించిన ఎమ్మెల్యే తిరుమగన్ ఆయన కుమారుడు కావడం గమనార్హం. దీంతో ఆయన కుటుంబం నుంచి ఉప ఎన్నికల బరిలో ఎవరైనా దిగుతారేమోననే చర్చ పెద్దఎత్తున జరుగుతోంది. అదే సమయంలో బీజేపీ తన బలాన్ని చాటుకునేందుకు సిద్ధమైంది.
ఈ నియోజకవర్గ కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు చేపట్టేందుకు అన్నామలై నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు సవాల్ విసురుతూ గాయత్రి ట్విట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉప ఎన్నికలలో పోటీకి ధైర్యం ఉందా..? ఉంటే పోటీకి స్వయంగా సిద్ధం కావాలని అన్నామలైను కోరారు. ఉప ఎన్నిక బరిలో అన్నామలై ఉంటే ప్రత్యరి్థగా తాను ఉంటానని స్పష్టం చేశారు. ఆయన నాటకాలు, కపట ప్రచారాలు ఢిల్లీ పెద్దలు నమ్మవచ్చేమోగానీ ఇక్కడ చెల్లవని వ్యాఖ్యానించారు. తాను తమిళనాడు ఆడ బిడ్డనని, అన్నామలై తమిళగం పుత్రుడు అని పేర్కొన్నారు. తమిళనాడు గొప్పదా..? తమిళగం.. గొప్పదా..? అనేది తేల్చుకుందాం రా.. అంటూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment