కేసీఆర్‌ను కొట్టడానికి రాలేదు: అమిత్‌ షా | GHMC Elections 2020: Amit Shah Slams TRS | Sakshi
Sakshi News home page

మా ప్రభుత్వం ఏర్పాటులో కేసీఆర్‌దే కీలకపాత్ర: అమిత్ షా

Published Sun, Nov 29 2020 4:06 PM | Last Updated on Sun, Nov 29 2020 4:37 PM

GHMC Elections 2020: Amit Shah Slams TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి మేయర్‌ పీఠం దక్కించుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా జోస్యం చెప్పారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, తమ ప్రభుత్వ ఏర్పాటులో కేసీఆర్‌దే కీలక పాత్ర అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు చూస్తేనే బీజేపీ విజయం ఖాయమని తెలుస్తుందన్నారు.
(చదవండి : రోడ్డు షో మధ్యలోనే ముగించిన అమిత్‌ షా)

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఆయన సికింద్రాబాద్‌లో రోడ్‌ షో నిర్వహించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయం చేరుకొని మీడియాతో మాట్లాడారు. రోడ్ షోలో స్వాగతం పలికిన హైదరాబాద్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సీట్లు పెంచుకోవడానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. మేయర్ సీటు గెలుచుకోవడానికే పోటీ చేస్తున్నామన్నారు. బీజేపీ అభ్యర్థే మేయర్ అవుతాడని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి హైదరాబాద్‌ను ఐటీ హబ్‌ కాకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. బీజేపీ ఒక్కసారి అవకాశం ఇస్తే హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ హబ్‌గా మారుస్తామన్నారు. ఎంఐఎం అండతోనే అక్రమ కట్టడాలు ఏర్పాటయ్యాయని, ఎంఐఎం మార్గదర్శనంలోనే టీఆర్ఎస్ నడుస్తోందన్నారు. బీజేపీకి అవకాశమిస్తే.. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తామన్నారు. హైదరాబాద్‌ నీళ్లలో మునిగినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రోడ్ల మీదకు రాలేదు.. ఎమ్మెల్యేలతో మాట్లాడలేదని విమర్శించారు. అమిత్‌ షా ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..

హుస్సేన్‌సాగర్‌ను శుద్ధి చేశారా?
‘ప్రధాని మోదీ ఏం చెప్తారో.. అదే చేస్తారు. 2014, 19లో మేమిచ్చిన వాగ్ధాలన్నీ పూర్తిచేశాం.నేనడిగే ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్తారనే ఆశిస్తున్నా. గత ఎన్నికల తర్వాత వంద రోజుల ప్రణాళిక అన్నారు.. ఏమైంది? లక్ష ఇళ్లు కడతామన్నారు.. ఏమైంది? ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నెరవేర్చలేకపోయింది. హుస్సేన్‌ సాగర్‌ను శుద్ధి చేస్తాం.. పర్యాటక కేంద్రంగా మారుస్తాం అన్నారు. ఏమయ్యాయి అవి. 15 డంపింగ్ యార్డులు అన్నారు.. ఎక్కడున్నాయి? 15 డంపింగ్ యార్డులు అన్నారు.. ఎక్కడున్నాయి? కొత్త ఆస్పత్రుల నిర్మాణం అన్నారు.. ఏమైంది? ప్రజలకు ఆయుష్మాన్ భారత్‌ ఫలాలు అందకుండా అడ్డుకున్నారు.

హైదరాబాద్‌ ఒక మినీ ఇండియాగా తీర్చిదిద్దుతాం
అవినీతిలో తెలంగాణ ప్రభుత్వం అన్నిసరిహద్దులు దాటేసింది. ఎంఐఎంతో పొత్తు ఉందో..లేదో చెప్పేందుకు ఎందుకు భయపడుతున్నారు? నేరుగా సీట్లు పంచుకొని పోటీ చేయండి. హైదరాబాద్‌లో రోహింగ్యాలను, బంగ్లాదేశీయులను ఏరివేద్దామనుకుంటే పార్లమెంటులో అడ్డుకున్నది ఎవరు? వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం. మా ప్రభుత్వం ఏర్పాటులో కేసీఆర్‌దే కీలకపాత్ర. కేసీఆర్ ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు చూస్తేనే మా విజయం ఖాయమని తెలుస్తుంది. నేను ఎన్నికల కోసం వచ్చాను.. కేసీఆర్‌ను కొట్టడానికి కాదు. కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో వందేళ్లు బతకాలి. అధికారం ఇస్తే హైదరాబాద్‌ను ప్రపంచానికే ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతాం.కేంద్రం ద్వారా హైదరాబాద్‌ చిరువ్యాపారులకు అత్యధికంగా లాభం జరిగింది.నవాబు, నిజాం సంస్కృతుల నుంచి విముక్తి చేసి..హైదరాబాద్‌ ఒక మినీ ఇండియాగా తీర్చిదిద్దుతాం’ అని అమిత్‌ షా పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement