సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో ఎన్నికల సంఘం ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు నడిచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.. రిగ్గింగ్ కోసమే బ్యాలెట్ పేపర్లు పెట్టారని ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీని తక్కువ అంచనా వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ది చెప్పారని విమర్శించారు. ఎన్నికలు హడావుడిగా నిర్వహించకపోతే బీజేపీ వందకు పైగా స్థానాల్లో గెలిచి, మేయర్ పీఠం సాధించేవాళ్లమని చెప్పారు. టీఆర్‌ఎస్ అడ్డదారిలో వెళ్లి గెలిచేందుకు ప్రయత్నించి విఫలమైందని విమర్శించారు.
(చదవండి : ఒవైసీ, కేసీఆర్ కలిసి బిర్యానీ తింటారు)
ఎంఐఎంకు బీజేపీ అడ్డుకునే స్థాయి లేదన్నారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలన్న బీజేపీ వాదాన్ని ప్రజలు సమర్థించారన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుమార్చుకోవాలని, లేదంటే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కేంద్రం నిధుల విషయంలో హైదరాబాద్ అభివృద్దికి సహకరిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇక జానారెడ్డి బీజేపీలో చేరతారనే అంశంపై స్పందిస్తూ.. ఆయన నుంచి ఎటువంటి ఫోన్ కాల్ రాలేదన్నారు. అలాగే ఢిల్లీ పెద్దల సమక్షంలో సోమవారం విజయశాంతి బీజేపీలో చేరుతున్నారని వెల్లడించారు. కాగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నగర ఓటరు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. టీఆర్ఎస్-55, బీజేపీ-48, ఎంఐఎం-44, కాంగ్రెస్-2 స్థానాల్లో విజయం సాధించింది.
(చదవండి : 7న ఢిల్లీకి వెళ్లనున్న బండి సంజయ్)
Comments
Please login to add a commentAdd a comment