మరింత హీటెక్కనున్న విశ్వనగర పోరు  | ghmc elections 2020 heated up | Sakshi
Sakshi News home page

గ్రేట్‌ ‘ఫైటు’..యమ హీటు!

Published Mon, Nov 23 2020 7:24 AM | Last Updated on Mon, Nov 23 2020 8:32 AM

ghmc elections 2020 heated up - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చలికాలంలోనూ హైదరాబాద్‌ నగరం ఎన్నికల వేడితో గరంగరంగా మారింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ప్రచారపర్వం ఊపందుకుంది. నామినేషన్ల పర్వం ముగిసి అభ్యర్థులెవరో కూడా తేలడంతో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు గ్రేట్‌ ఫైట్‌గా మారనున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ దూకుడును అడ్డుకుంటామన్న ధీమాతో కమలనాథులు రం గంలోకి దిగడం, కాంగ్రెస్‌ కూడా తనకు అనుకూలంగా ఉన్న చోట్ల ప్రభావం చూపేందుకు వ్యూహాలు రచిస్తుండటం, తనకు మంచి పట్టు న్న స్థానాల్లో ఎంఐఎం ఎప్పటిలాగే దూసుకెళుతుండడం, మిగిలిన రాజకీయ పక్షాలు కూడా అక్కడక్కడా పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో గ్రేటర్‌ పోరు రసవత్తరం కానుంది. 

జోరుగా విమర్శలు... ప్రతి విమర్శలు 
ఓటర్లను ఆకట్టుకునే క్రమంలో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎంల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వరద బాధితులకు పరిహారం పంపిణీతో మొదలైన ఈ ఎన్నికల వేడి టీఆర్‌ఎస్‌ సెంచరీ ధీమా, బీజేపీ భాగ్యలక్ష్మి ఆలయం ట్విస్ట్, కాంగ్రెస్‌ ఆరోపణలు, ఎంఐఎం నేతల ఆసక్తికర వ్యాఖ్యల నేపథ్యంలో మరింత రగులుకుంటోంది. తాము గత ఎన్నికల్లో 99 స్థానాలు గెలిచినా ఈసారి సెంచరీ కొడతామని, పాతబస్తీలోని 10–12 స్థానాల్లో ఎంఐఎంను కూడా ఓడిస్తామని, విశ్వ నగరం కావాలో, విద్వేష నగరం కావాలో ప్రజలే తేల్చుకోవాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయవేడిని మరింత పెంచుతున్నాయి. దుబ్బాక విజయంతో ఊపు మీదున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సీఎంను సవాల్‌ చేస్తూ కమలనాథుల్లో ఉత్సాహం తెచ్చేందుకు ప్రయత్నిస్తుండటం ఈ ఎన్నికల్లో ప్రధాన చర్చనీయాంశమవుతోంది.

ఈ రెండు పార్టీ లు ఒకటేనని, ఎంఐఎంతో కలిసి ముగ్గురూ డ్రామాలు ఆడుతున్నారని, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తామే కనుక తమను ఆదరించాలని కాంగ్రెస్‌ నేతలు కూడా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఎంఐఎం ఎమ్మెల్యే ఒకరు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ప్రకటించడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అన్ని పార్టీలు, అభ్యర్థులు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ తమ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తుండటం జీహెచ్‌ఎంసీ ఎన్నికల క్షేత్రాన్ని హాట్‌హాట్‌గా మారుస్తోంది. 

టీఆర్‌ఎస్‌ పాలనపై బీజేపీ చార్జ్‌షీట్‌.. 24న కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల
తమను గెలిపిస్తే గ్రేటర్‌ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేస్తామనే దానిపై టీఆర్‌ఎస్‌ అన్ని పార్టీల కన్నా ముందే మేనిఫెస్టో కూడా విడుదల చేసింది. ఈ నెల 24న కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. బీజేపీ కూడా నేడో, రేపో మేనిఫెస్టో విడుదల చేయనుంది. అయితే, కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఆదివారం హైదరాబాద్‌కు వచ్చి పార్టీ మేనిఫెస్టో కంటే ముందే టీఆర్‌ఎస్‌ పాలనపై చార్జ్‌షీట్‌ విడుదల చేయడం గమనార్హం.

ముందంజలో టీఆర్‌ఎస్‌
టీఆర్‌ఎస్‌ పక్షాన ఎన్నికల ప్రచార బాధ్యతలను తీసుకున్న కేటీఆర్‌ ఇప్పటికే రోడ్‌షోలతో నగరంలో హల్‌చల్‌ చేస్తున్నారు. మిగిలిన పార్టీల కంటే ప్రచార పర్వంలో ముందున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సీనియర్‌నేత లక్ష్మణ్‌లు కూడా కార్యరంగంలో దూకుడుగానే వెళ్తున్నారు. కాంగ్రెస్‌ పక్షాన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి, ముఖ్య నేతలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, షబ్బీర్‌అలీ తదితరులు కూడా తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేస్తున్నారు. ఎంఐఎం తన అడ్డా అయిన పాతబస్తీలో ఎప్పటిలాగే ప్రచారపర్వంలో ముందంజలో ఉంది.

వామపక్షాలు, టీజేఎస్, టీడీపీలు విడివిడిగా పోటీ చేస్తుండటం, పార్టీల టికెట్లు రాని నేతలు స్వతంత్రులుగా పలుచోట్ల పోటీకి దిగడం, ఆయా ప్రధాన పార్టీల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు, శ్రేణులు కూడా హైదరాబాద్‌కు వచ్చి ప్రచారపర్వంలో బిజీగా మారడంతో గ్రేటర్‌ పరిధిలోని బస్తీలు ఎన్నికల ప్రచారంతో హోరెత్తుతున్నాయి. మొత్తం మీద జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో రానున్న ఐదు రోజులపాటు రాజకీయ పార్టీల మధ్య మరిన్ని మాటల తూటాలు పేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement