ఇచ్చిన హామీలు.. పెట్టిన ఫొటోలు మావే! | GHMC Elections 2020: KTR Satires On BJP Manifesto | Sakshi
Sakshi News home page

ఇచ్చిన హామీలు.. పెట్టిన ఫొటోలు మావే!

Published Fri, Nov 27 2020 1:35 AM | Last Updated on Fri, Nov 27 2020 4:59 AM

GHMC Elections 2020: KTR Satires On BJP Manifesto - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం విడుదల చేసిన మేనిఫెస్టోపై టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు విమర్శలు సంధించారు. బీజేపీ ఎన్నికల ప్రణాళిక పూర్తిగా అరువు తెచ్చుకున్నదే అని ఎద్దేవా చేస్తూ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ఆ పార్టీ హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారం కోసం ఇతర రాష్ట్రాల నుంచి నాయకులను అరువు తెచ్చుకుందని, ఇదే రీతిన ప్రకటించిన మేనిఫెస్టోలో హామీలన్నీ అప్పు తెచ్చుకున్నవేనని విమర్శించారు.  

మా ఫొటోలతో బీజేపీ పోజులు.. 
టీఎస్‌ బీపాస్, వరద బాధితులకు సహాయం, కులవృత్తులకు ఉచిత కరెంటు, మహిళా పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు, నగరంలో టాయిలెట్ల నిర్మాణం, మెట్రో కారిడార్‌ విస్తరణ, పెద్దఎత్తున ఫ్లైఓవర్‌ నిర్మాణం, మూసి ఫ్రంట్‌ డెవలప్‌మెంట్, నగరం నలువైపులా డంపింగ్‌ యార్డులు, భవన నిర్మాణ కార్మికులకు భీమా వంటి హమీలకు ఇప్పటికే టీఆర్‌ఎస్‌ కార్యరూపం ఇచ్చిందని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ గత ఆరేళ్లుగా విజయవంతంగా కొనసాగిస్తున్న కార్యక్రమాలన్నింటినీ మక్కీకి మక్కీగా బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. 

ఇప్పటికే తమ ప్రభుత్వం పూర్తి చేసిన మెట్రోరైల్‌ ప్రాజెక్టు, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, టాయిలెట్ల నిర్మాణం, జవహర్‌ నగర్‌ ప్రజలకు ఇబ్బందిని తొలగించే అక్కడి లెగసీ డంప్‌కి వేసిన గ్రీన్‌ కవర్‌ కార్యక్రమం, మూసీ రివర్‌ ప్రంట్‌ కార్పొరేషన్‌ తరపున మూసీ ఒడ్డున చేపట్టిన అభివృద్ధి, తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా పోలీస్‌ స్టేషన్, చార్మినార్‌ వద్ద చేపట్టిన పాదచారుల ప్రాజెక్టు ఫొటోలు, చివరకు సీఎం కేసీఆర్‌ జీతం రెట్టింపు చేయడంతో సంతోషపడుతున్న పారిశుద్ధ్య కార్మికురాలి ఫొటోలతో బీజేపీ ఫోజులు కొడుతోందని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రణాళికనే సొంతంగా రాయలేని బీజేపీ.. రేపు నగర అభివృద్ధి ప్రణాళికలను కనీసం కల్పన చేయగలుగుతుందా అని నిలదీశారు. ప్రతి ఆలోచన మాది కాపీ కొట్టి.. మీది.. మోదీ అంటే ఎలా అంటూ కేటీఆర్‌ ప్రశ్నించారు. 

మీరు కోరుకునే మార్పు ఏంటి? 
మార్పు కోసం బీజేపీ అంటూ మేనిఫెస్టో మొదలుపెట్టిన ఆ పార్టీ ఏ మార్పు కోరుకుంటుందో నగర ప్రజలకు చెప్పాలంటూ కేటీఆర్‌ పలు ప్రశ్నలు సంధించారు. ‘పచ్చని హైదరాబాద్‌లో చిచ్చుపెట్టే మార్పా? విశ్వనగరాన్ని విద్వేషనగరంగా మార్చే మార్పా? అభివృద్ధికి పాతరేసి అరాచకానికి తెరలేపే మార్పా? వికాసాన్ని కాదని.. విధ్వంసాలు సృష్టించే మార్పా? సౌభాగ్యనగరాన్ని.. అభాగ్యనగరంగా మార్చే మార్పా..? విద్వేషాల కోసం.. ఉద్యోగాలు పణంగా పెట్టే మార్పా? గ్లోబల్‌ సిటీలో.. మళ్లీ గోకుల్‌చాట్‌ పేలుళ్ల మార్పా? యువత భవితను ప్రశ్నార్థకం చేసే మార్పా? కూల్చివేతలు.. కర్ఫ్యూల కలకలం రేపే మార్పా?’అని ప్రశ్నించారు. ఏ మార్పు కోసం బీజేపీ పనిచేస్తుందో స్పష్టం చేయాలన్నారు. 

వ్యాక్సిన్‌కీ ఫీజు అడుగుతారేమో..? 
బీజేపీకి ఓటేస్తే కరోనా వ్యాక్సిన్‌ ఫ్రీగా ఇస్తామంటూ బీజేపీ చేసిన హామీని కూడా కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ‘కరోనా సమయంలో వలస కార్మికుల నుంచి రైల్వే చార్జీలు వసూలు చేసిన ఘనత బీజేపీదే.. రేపు ఎన్నికల తర్వాత వ్యాక్సిన్‌ కోసం ప్రజల నుంచి ఫీజు వసూలు చేసే పార్టీ బీజేపీయే. ఇప్పటిదాకా బీజేపీ ప్రకటించిన ప్యాకేజీలన్నీ డొల్ల.. ఆ పార్టీ, తాజాగా నగరానికి మరో ప్యాకేజీ అంటూ హైదరాబాద్‌ ప్రజల చెవుల్లో కమలం పువ్వులు పెడుతోంది. ఇప్పటికే ప్రతి ఒక్కరికి రూ.15 లక్షలు.. రూ.20 లక్షల కోట్ల కరోనా ప్యాకేజీ అంటూ ప్రజల్ని దగా చేసిన బీజేపీ.. మరోసారి హైదరాబాద్‌ ప్రజలను వంచించేందుకు కొత్త నాటకం ఆడుతోంది. బీజేపీ మేనిఫెస్టోలోని డొల్లతనాన్ని, అసత్యాలను, ఆచరణ సాధ్యం కానీ హామీలను ప్రజలు గమనించాలి’అని కేటీఆర్‌ కోరారు. 

కాపీ కొట్టడానికి కూడా తెలివి కావాలి 
బీజేపీ మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఫొటోలను వాడుకున్నారని, దానిని తాము అభినందన (కాంప్లిమెంట్‌)గా తీసుకుంటామని కేటీఆర్‌ అన్నారు. ‘ప్రియమైన మేనిఫెస్టో రచయితల్లారా.. మీరు చేయబోయే పనులకు ఇప్పటికే మా ప్రభుత్వం అభివృద్ధి చేసిన జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డ్, మహిళా పోలీస్‌స్టేషన్, టాయిలెట్ల చిత్రాలు వాడుకున్నారు. పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కదా.. జీహెచ్‌ఎంసీ ఎలా ఏర్పాటు చేస్తుంది? కాపీ కొట్టాలన్నా తెలివి ఉండాలి’అని ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement