సాక్షి ముంబై: నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్,కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల ఉద్యమం పట్ల కేంద్రం వైఖరిపై మండిపడ్డారు. గత 60 రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం వారి సమస్యకు సరైన పరిష్కారం చూపకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా ముంబైలో రైతు ర్యాలీనుద్దేశించి సోమవారం ఆయన ప్రసంగించారు.
ముంబైలోని ఆజాద్ మైదాన్ వద్ద ఈ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన శరద్‌పవార్ ప్రధానమంత్రి నరంద్రమోదీ తీరును తప్పుపట్టారు. అంతేకాదు ఇంతకు ముందు అలాంటి గవర్నర్‌ను చూడలేదంటూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీపై విమర్శలు గుప్పించారు రైతు ఉద్యమకారులు గవర్నర్‌ను కలవాలన్న ప్రణాళికపై శరద్‌పవార్ స్పందిస్తూ.. గవర్నర్‌కు కంగనా ( బాలీవుడ్ హీరోయిన్) ను కలిసే ససమయం ఉంది కానీ, రైతులను కలిసి ఉద్దేశం లేదంటూ ఎద్దేవా చేశారు. ఆందోళన చేస్తున్న రైతులను మీరు కలవడం గవర్నర్ కనీస నైతిక బాధ్యత అని వ్యాఖ్యానించారు.
పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వేలమంది రైతులు ఎముకలు కొరికే చలిలో రైతులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. చలి,ఎండ వర్షం లాంటి పరిస్థితులకు వెరవకుండా ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారని పవార్ వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోదీ రైతుల ఆందోళనపై కనీసం ఆరా తీయక పోవడాన్ని తప్పుపట్టారు. తమ హక్కులకోసం ఉద్యమిస్తున్న రైతులు పాకిస్థానీయులా పంజాబ్ పాకిస్తాన్‌లో ఉందా అని శరద్ పవార్ ఘాటుగా ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment