సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి పాలనలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టారని.. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయాలను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేయడంపై శనివారం ఉదయం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘ ఏపీలో కూటమి సర్కార్ సాగిస్తున్న పాలన దేనికి సంకేతం?. కోర్టు ప్రొసీడింగ్‌లో ఉండగానే తాడేపల్లి కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేశారు. పైగా చేసిందంత చేస్తూ.. అసెంబ్లీలో నీతులు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నామని ఏదైనా చేస్తామంటే పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు వస్తాయి. మీకు వచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటున్నారనేది ప్రజలు గమనిస్తున్నారు’’ అని అన్నారాయన.
అధికారంలోకి వచ్చిన పార్టీకి సమయం ఇచ్చిన అవసరం ఉందని, ఆరు నెలలు గడిచాక పరిస్థితుల్ని చూసి ప్రభుత్వం తీరును ఖండిద్దామని పార్టీ అధినేత వైఎస్ జగన్ తమతో చెప్పారని, కానీ, అధికారం చేపట్టి 20 రోజులు పూర్తి కాకముందే రాష్ట్రంలో ఈ తరహా పరిస్థితులు నెలకొన్నాయని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖపట్నం, అనకాపల్లి కార్యాలయల విషయంలో అనుమతులు తీసుకునే తాము రూల్స్ ప్రకారం నిర్మాణాలు చేపట్టామని ఆయన మీడియాకు వివరించారు. పార్టీ కార్యాలయాలు తమకు దేవాలయాలతో సమానమన్న అమర్నాథ్.. కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. అలాగే.. ఏపీ ప్రజలంతా ఈ కక్షపూరిత రాజకీయ చర్యలను గమనించాలని కోరారాయన.
Comments
Please login to add a commentAdd a comment