సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ విపత్తు వేళ మెరుగైన సేవలందిస్తూ సీఎం వైఎస్ జగన్ ఆపద్బాంధవుడిగా నిలుస్తుంటే... చంద్రబాబు రాబందులా తయారయ్యారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. శనివారం మద్దిలపాలెంలోని పార్టీ నగర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
విపత్తులు ఎప్పుడొస్తే అప్పుడు చంద్రబాబు వికృతానందం పొందుతారని విమర్శించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాల్సిన చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్‌లో అద్దాల మేడలో కూర్చొని ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కోవిడ్‌తో మరణించినవారికి కొవ్వొత్తులు వెలిగించి బాబు సంతాప కార్యక్రమం నిర్వహించారని.. మరి ఆయన సీఎంగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల్లో ఆయన వల్ల మృతి చెందిన 29 మందికి ఒక్క కొవ్వొత్తి అయినా ఎందుకు వెలిగించలేదని నిలదీశారు. సరిహద్దుల్లో అంబులెన్స్‌లను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటే తెలంగాణలో ఉన్న చంద్రబాబు ఇదేమిటని కేసీఆర్‌ను ప్రశ్నించలేదన్నారు. కేసీఆర్ జైలులో వేస్తారన్న భయమే దీనికి కారణమని ఎద్దేవా చేశారు.
రఘుపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదా?
ప్రజలు కోవిడ్‌తో మరణిస్తుంటే స్పందించని చంద్రబాబు రఘురామకృష్ణరాజును ఎలా కాపాడాలి? ఏబీఎన్ రాధాకృష్ణని ఎలా కాపాడాలి? రామోజీరావుని ఎలా కాపాడాలి? అనే ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. వ్యాక్సిన్ ఫార్ములాను మిగతా కంపెనీలకు బదిలీ చేస్తే దేశంలో ఉన్న ప్రజలకు వ్యాక్సిన్ తొందరగా అందుతుందన్న సీఎం సూచనను కేంద్రం అమలు చేసే పరిస్థితులు ఉన్నాయన్నారు. జాతీయ మీడియా సైతం సీఎం సూచనలను అభినందించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment