సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన వాతావరణం నెలకొందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సులభతర వాణిజ్యం)లో ఏపీ 97.89 శాతంతో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచినట్లు కేంద్ర వాణిజ్యశాఖ వెల్లడించిందని గుర్తుచేశారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక ప్రతిపక్ష నేత చంద్రబాబు దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ సంక్షేమ పథకాల ద్వారా పేదలకు ప్రయోజనం చేకూరుస్తూ మారుమూల ప్రాంతాలను సైతం అభివృద్ధి చేస్తుంటే ఎందుకంత కడుపు మంట? అని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు కడుపుమంటకు మందే లేదని వ్యాఖ్యానించారు.
సమ్మిట్స్ పేరుతో మోసం చేసిందెవరు?
ఐదేళ్ల టీడీపీ పాలనలో నాలుగు సార్లు విశాఖలో సమ్మిట్లు నిర్వహించి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నామని, 40 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేయడం వాస్తవం కాదా? అని మంత్రి అమర్‌నాథ్ ప్రశ్నించారు. ఐదేళ్లలో చంద్రబాబు చేయలేని పనులను సీఎం జగన్ నెరవేరుస్తుండటంతో టీడీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. కాగితాల్లో పెట్టుబడులు, గ్రాఫిక్స్‌లో రాజధానిని చూపించి మోసం చేసిన చంద్రబాబుకు పారిశ్రామికాభివృద్ధిపై మాట్లాడే హక్కే లేదన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే రాష్ట్రంలో కార్ల తయారీ పరిశ్రమ స్థాపించేందుకు కియా మోటార్స్ అంగీకరించిందని గుర్తు చేశారు. అది తన ఘనతగా చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రం నుంచి ఎగుమతుల్లో కియా మోటార్స్ వాటా 4 శాతమేనని చెప్పారు.
పారిశ్రామికాభివృద్ధి పరుగులు..
పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధిని కాగితాల్లో కాకుండా సీఎం జగన్ వాస్తవికంగా చూపుతున్నారని మంత్రి అమర్‌నాథ్ తెలిపారు. గ్రీన్ ఎనర్జీ విభాగంలో పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ సైతం ప్రశంసించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ విభాగంలో రూ.1.25 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు పెద్ద పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని చెప్పారు. రాష్ట్రానికి 974 కి.మీ. సుదీర్ఘ తీరం ఉన్నందున ప్రతి 50 కి.మీ.కి ఒక పోర్టు లేదా హార్బర్‌ను నెలకొల్పి పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు.
విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో కొప్పర్తి, శ్రీకాళహస్తి–ఏర్పేడు, విశాఖ నోడ్‌లను తొలి దశలో అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో ఓర్వకల్లు నోడ్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. పరిశ్రమల కోసం లక్ష ఎకరాల భూమిని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి, రహదారులు, విద్యుత్, నీరు లాంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించి సీఎం జగన్ భరోసా ఇస్తుండటంతో పెట్టుబడులు పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్తలు పోటీ పడుతున్నారని తెలిపారు.
విశాఖలో వెయ్యి మంది ఉద్యోగులతో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏర్పాటు కానుందని చెప్పారు. ‘రానున్న రెండేళ్లలో ఎంఎస్‌ఎంఈలు 1.25 లక్షల యూనిట్లు ఏర్పాటయ్యేలా కృషి చేస్తున్నాం. ఇందులో రూ.15 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు. తద్వారా 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించేలా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే ఈ రంగానికి రూ.1,800 కోట్ల రాయితీలు ప్రోత్సాహకాలుగా అందించాం. వచ్చే ఆగస్టులో మరో రూ.500 కోట్లు ఇస్తాం. కరోనా కష్ట కాలంలో పరిశ్రమలను ఆదుకుని అండగా నిలిచాం’ అని పేర్కొన్నారు.
జనసేన కాదు... ధనసేన
పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ జనసేనను ధనసేనగా.. జనవాణిని ధనవాణిగా మార్చుకుంటే బాగుంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు. ‘ఎనిమిదేళ్ల క్రితం పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో టీడీపీతో జట్టుకట్టారు. చంద్రబాబు హామీలకు తనది పూచీ అన్నారు. ఐదేళ్లలో ఒక్క హామీ కూడా అమలు చేయకుండా టీడీపీ మోసం చేస్తే పవన్ కళ్యాణ్ ఏనాడైనా ప్రశ్నించారా?’ అని నిలదీశారు.
95 శాతం హామీలను నెరవేర్చిన సీఎం జగన్‌ను ప్రశ్నించడం విడ్డూరమన్నారు. పవన్ కళ్యాణ్‌కు ఎక్కడ డబ్బులొస్తే అక్కడకు వెళ్తారని.. ఆయన వేలంపాటలో పాల్గొంటే మంచిదని సలహా ఇచ్చారు. ప్రపంచంలో ఆప్షనల్ రాజకీయాలు చేసేది ఒక్క పవన్ మాత్రమేనని చెప్పారు. ఎనిమిదేళ్లలో ఎనిమిది పార్టీలతో పొత్తు పెట్టుకున్న ఘనుడు కూడా ఆయన ఒక్కరేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment