అహ్మదాబాద్: గుజరాత్ శాసనసభా ఎన్నికల సందర్భంగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా కుటుంబంలో ‘ఫ్యామిలీ పాలిటిక్స్’ ఆసక్తి కరంగా సాగుతున్నాయి. జడేజా సతీమణి రివాబా.. బీజేపీ తరపున జామ్‌నగర్ నార్త్ నుంచి పోటీలో నిలిచారు. భార్యను గెలిపించడానికి జడేజా విస్తృత ప్రచారం చేశాడు. అయితే జడేజా తండ్రి, అనిరుధ్‌సిన్హ్, సోదరి నయ్‌నబా మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించమని అభ్యర్థించడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వాట్సాఫ్‌లో చక్కర్లు కొడుతోంది.
తమ్ముడిలాంటోడు.. గెలిపించండి
కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న బిపింద్రసిన్హ్ తనకు తమ్ముడు లాంటివాడని, అతడిని గెలిపించాలని నార్త్ జామ్‌నగర్ ఓటర్లను అనిరుధ్‌సిన్హ్ కోరారు. ముఖ్యంగా రాజ్‌పుత్‌లు అతడికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వాట్సాప్‌లో చక్కర్లు కొట్టడంతో జడేజా కుటుంబంలో ‘ఫ్యామిలీ పాలిటిక్స్’పై గుజరాత్ ఓటర్లు చర్చించుకుంటున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే జడేజా సోదరి నయ్‌నబా.. జామ్‌నగర్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ తరపున ఇన్‌చార్జిగా ఉన్నారు.
జడేజా వర్సెస్ జడేజా
జామ్‌నగర్ నార్త్‌లో పోటీని ‘జడేజా వర్సెస్ జడేజా’గా చూడాల్సిన అవసరం లేదని నయ్‌నబా పేర్కొన్నారు. విభిన్న సైద్ధాంతికత కలిగిన కుటుంబాలు జామ్‌నగర్‌లో చాలా ఉన్నాయని వెల్లడించారు. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నా... తమ కుటుంబాల మధ్య ఎటువంటి వివాదాలు లేవన్నారు. తనవారంతా బాగుండాలని కోరుకుంటానని చెప్పారు.
అది ఆయన వ్యక్తిగత విషయం
మామగారి వీడియోపై రివాబా తనదైన శైలిలో స్పందించారు. ఒకే పార్టీలో రెండు పార్టీలకు చెందిన వారు ఉండడం కొత్త విషయమేమి కాదని అన్నారు. ‘నా మామగారిలా కాకుండా మరో పార్టీకి చెందిన కార్యకర్తగా ఆయన మాట్లాడారు. అది ఆయన వ్యక్తిగత విషయం. జామ్‌నగర్ ప్రజలపై నాకు నమ్మకం ఉంది. జామ్‌నగర్ మాకు ఎన్నో ఇచ్చింది. నా భర్త ఇక్కడే పుట్టి, కెరీర్ ఆరంభించాడ’ని రివాబా పేర్కొన్నారు. అయితే తన భర్త మాత్రం తనకే అండగా ఉన్నాడని, ఇందులో ఎటువంటి సందేహం లేదన్నారు.
కాగా, గుజరాత్ మొదటి విడత ఎన్నికలు గురువారం ముగిశాయి. నార్త్ జామ్‌నగర్‌లో ఈ రోజు పోలింగ్ జరిగిన 89 నియోజకవర్గాల్లో ఉంది. ఇక్కడ ఎవరు గెలుస్తారనేది డిసెంబర్ 8న తేలుతుంది. (క్లిక్ చేయండి: ఏ మ్యానిఫెస్టోలో ఏముంది?)
Comments
Please login to add a commentAdd a comment