ఆయనో పెద్ద పారిశ్రామికవేత్త. గుంటూరు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. వ్యాపార పనుల్లో ఎంపీ అన్న సంగతి మరిచిపోయారేమో..? రెండోసారి గెలిచాక.. ఈ మూడేళ్ళలో ఐదారు సార్లు కూడా నియోజకవర్గానికి రాలేదట. ప్రజలు తమ ఎంపీని చూడాలనుకుంటే టీవీల్లో మాత్రమే దర్శనమిస్తారు. ఆయనే గల్లా జయదేవ్. గుంటూరు నుంచి రెండుసార్లు టీడీపీ తరపున ఎంపీగా గెలిచారు. కానీ గల్లా అంటే ఎంపీగా కంటే.. పారిశ్రామికవేత్తగానే అందరికీ గుర్తుంటారు. ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధిగా నియోజకవర్గానికి రావడం చాలా అరుదు. అసలు గుంటూరు ప్రజలను మీ ఎంపీ ఎవరని అడిగితే.. ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు రెండు మూడు నెలలకు ఒకసారి అయినా గుంటూరుకు వచ్చి పోతుండేవారు. అది కూడా ఆయన సొంత పనులకోసం మాత్రమే. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. 2019 ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా గెలుపొందారు. గల్లా పోటీ చేసే సమయంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గల్లా గెలిస్తే టీవీలో చూసుకోవాల్సిందేనంటూ ప్రచారం చేశారు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఇప్పుడు అక్షరాలా నిజమవుతున్నాయి.
గల్లా జయదేవ్ గుంటూరును పూర్తిగా మర్చిపోయారు. గతంలోలా అప్పుడప్పుడు కూడా రావడంలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు వచ్చినా కూడా ఎంపీ మాత్రం కనిపించడు. టీడీపీ తరపున ఏ కార్యక్రమం నిర్వహించినా గల్లా మాత్రం గైర్హాజరవుతారు. ఎంపీగా గెలిచి మూడేళ్లు అయినా ఐదారుసార్లు మాత్రమే గుంటూరు వచ్చారంటే ఆయనకు ప్రజలపట్ల ఎంత బాధ్యత ఉందో అర్దమవుతుంది. గుంటూరు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజలైతే అసలు మనకు ఎంపీ ఉన్నాడా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. గల్లాను చూడాలంటే పార్లమెంట్ సమావేశాల్లో టీవీల్లో చూడడమే తప్ప ప్రత్యక్షంగా కనిపించరు. గల్లా తీరుపై తెలుగుదేశం పార్టీలో కూడా పూర్తి అసంతృప్తి కనిపిస్తోంది.
ఎంపీతో ఏదైనా పని పడితే ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు. గల్లా జయదేవ్‌ను కలవాలంటే ఎవరిని సంప్రదించాలో తెలియదు. గుంటూరులోని ఆయన ఆఫీసులో కూడా చిత్తూరు జిల్లాకు చెందిన ఒకరిద్దరు ఉంటారు. వారిని అడిగితే ఎంపీ ఎప్పుడొస్తారో, ఇప్పుడెక్కడున్నారో తెలియదంటారు. ఎంతో కష్టపడి గల్లాను ఎంపీగా గెలిపించుకుంటే ఇప్పుడు తమ సమస్యలు వినడానికి కూడా అందుబాటులో లేకుండా పోయాడని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కొంతమంది సీనియర్ నేతలైతే చంద్రబాబు కుటుంబంతో సన్నిహిత సంబంధాలుండడంతోనే తానేం చేసినా చెల్లుబాటు అవుతుందని గల్లా ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా వ్యాపారదృక్పధంతో మునిగి తేలే నాయకులను ఎంపీలుగా ఎన్నుకుంటే ఇలాగే ఉంటుందని సొంతపార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ నేతలకు చంద్రబాబు అపాయింట్మెంట్ అయినా దొరుకుతుందేమో కానీ గల్లా అపాయింట్మెంట్ దొరకడం కష్టమని సెటైర్లు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment