మాట్లాడుతున్న జీవీఎల్
నెల్లూరు (బారకాసు): ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు చెప్పారు. అభ్యర్థి ఎవరనేది తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. గురువారం నెల్లూరులో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీ చేయబోతున్నాం తప్ప మరే పార్టీతోనూ పొత్తుపెట్టుకోబోమన్నారు. టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందని చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే చంద్రబాబు బీజేపీ అధినాయకులతో మాట్లాడామని అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికలకు సమాయత్తం కావాలి: సోము వీర్రాజు
ఏపీలో 2024లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ శ్రేణులకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. గురువారం నెల్లూరులో నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ప్రధాని మోదీ చేస్తోన్న పరిపాలన, ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్న సహాయ, సహకారాలను ప్రజలకు తెలియజేయాలని నేతలకు సూచించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణక్రాకకు చెందిన బిజవేముల రవీంధ్రనాథ్‌రెడ్డి బీజేపీలో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, మాధవ్, పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్‌ధర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment