ఇతరుల ఘనతను తమ ఖాతాలో వేసుకుంటున్నారు : హరీశ్‌రావు
సీతారామ ఎత్తిపోతల పథకంనాటి సీఎం కేసీఆర్ కల
సాక్షి, హైదరాబాద్: ఇతరుల ఘనతను తమదిగా చెప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారుడుతనంతో పరాన్నజీవుల్లా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టు క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ మంత్రులు నెత్తిమీద నీళ్లు చల్లుకొని పోటీలు పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. మంత్రులకు పేరు వస్తుందనే భయంతోనే... క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు ఈ నెల 15న సీఎం రేవంత్ సీతారామ ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్నారని చెప్పారు.
మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌తో పాటు ఖమ్మంజిల్లా నేతలతో కలిసి సోమవారం తెలంగాణభవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టును అడ్డుకునేందుకు కోర్టులో కాంగ్రెస్ కేసులు వేసినా, బీఆర్‌ఎస్ అనేక కష్టాలను అధిగమించి పనులు పూర్తి చేసిందన్నారు. కానీ రిబ్బన్ కటింగ్ చేసే అవకాశం రావడంతో ప్రాజెక్టు తాము కట్టినట్టుగా కాంగ్రెస్ నేతలు కటింగ్‌లు ఇస్తున్నారని మండిపడ్డారు.
నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి
ఏళ్లకేళ్లు పట్టే ప్రాజెక్టు డిజైన్, భూసేకరణ, అనుమతులు తదితరాలన్నీ ఏడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రూ.75 కోట్లతో లక్షన్నర ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్నారు. వందేళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాడు కేసీఆర్ సీతారామ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టా రని, గతంలో కేసీఆర్‌కు క్రెడిట్ ఇచ్చిన మంత్రి తుమ్మల.. ప్రస్తుతం మాట మార్చారని చెప్పారు.
సత్యవాక్య పరిపాలకులు సీతారాముల పేరుపై కట్టిన ప్రాజెక్టుపై మంత్రులు అబద్ధాలు చెబితే భగవంతుడు కూడా క్షమించడన్నారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ తరఫున పండుగ నిర్వహిస్తామన్నారు.
వాట్సాప్ హెల్ప్‌లైన్ దరఖాస్తుల పరిశీలన
రుణమాఫీ అందని రైతుల కోసం తెలంగాణభవ న్‌లో ప్రారంభించిన వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు అందిన దరఖాస్తులను హరీశ్ పరిశీలించారు. 83748 52619 నంబరుకు వాట్సాప్ ద్వారా 72వేలకు పైగా దరఖాస్తులు అందాయని చెప్పారు. ఈ సమావేశంలో మాజీఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment