సాక్షి, హైదరాబాద్/సిద్దిపేటజోన్: రేవంత్‌రెడ్డి తన పుట్టినరోజున కూడా తండ్రి వయసున్న కేసీఆర్ మీద, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి మీద చేసిన నీచమైన వ్యాఖ్యలు అత్యంత హేయమని మాజీమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పిచ్చి ప్రగల్బాలు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలని, నిరంకుశత్వం మాని నిర్మా ణాత్మక నిర్ణయాలపై శ్రద్ధ వహించాలని హితవు పలికారు. శుక్రవారం విడుదల చేసిన వేర్వేరు ప్రకటనల్లో హరీశ్‌రావు సీఎంపై ధ్వజమెత్తారు.
కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోని నువ్వు, సీఎం స్థాయి దిగజారి మాట్లాడుతున్నావని, నీలాగా వికృతంగా మాట్లాడే ముఖ్యమంత్రిని ఈ దేశం ఎప్పుడూ చూసి ఉండదని పేర్కొన్నారు. ఇది ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డికి సరిగ్గా సరిపోతుందన్నారు. తప్పు మీద తప్పు చేసి వదరబోతులా ప్రవర్తిస్తున్న రేవంత్‌రెడ్డి తీరును ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. మూసీ నీళ్ల మురికితో కడిగినా నీ నోరు మురికిపోదని, నీ వంకర బుద్ధి ఇగ మారదన్నారు. బ్యాగులు మోసి, బ్యాగులు పంచి అడ్డ తోవన అధికారంలోకి వచి్చన నీచ చరిత్ర నీదని ఆరోపించారు. నీ దోపిడిని, నీ దొంగబుద్ధిని నిరూపించి ప్రజాక్షేత్రంలోనే నీకు బుద్ధి చెబుతామని హరీశ్‌రావు హెచ్చరించారు.
ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో వరుసగా విషాహార ఘటనలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వ తీరులో మార్పు లేదని హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అలసత్వంతో గురుకుల విద్యార్థుల కష్టాలు తీరడం లేదన్నారు. విషాహారం తిని మంచిర్యాల గిరిజన గురుకులంలో 12 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైన ఘటన జరిగి 24 గంటలు కూడా కాకమునుపే మరోసారి వాంతులు, కడుపునొప్పితో విద్యార్థులు ఆస్పత్రిలో చేరారన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గాడితప్పిన పాలనకు వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పారు.
సీఎం రేవంత్‌వన్నీ కోతలే..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం గడప దాటడం లేదని, ప్రజలంతా గమనిస్తున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో 237మందికి రూ. 55.57 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల గుండెల్లో ఈ భూమి ఉన్నంత కాలం కేసీఆర్ పదిలంగా ఉంటారని అన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా.. తెలంగాణ రాకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేనా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment