
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో ప్రజాపాలన కాదని.. రాక్షస పాలన నడుస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. వరద బాధితులకు సాయం చేద్దామని వెళ్తే తమపై దాడి చేయడమే కాకుండా మళ్లీ తమపైనే కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సీఎం రేవంత్‌రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడబోమని స్పష్టం చేశారు. ఖమ్మం వరద బాధితులను ఆదుకొనేందుకు సిద్దిపేట నుంచి దాతల సహకారంతో సేకరించిన నిత్యావసరాలను మూడు వాహనాల్లో నింపి వాటిని గురువారం జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ వరద బాధితులకు సాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు రూ. 2 లక్షలు అందించాలని డిమాండ్ చేశారు. బాధితులకు సిద్దిపేట నుంచి ఉడుతా భక్తిగా సాయం చేస్తున్నామన్నారు. సిద్దిపేటలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కోసం హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందన్నారు. చెక్కులు ఇద్దామంటే ప్రభుత్వ పెద్దలు ఎవరూ సహకరించడం లేదని పేర్కొన్నారు. కాగా, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననీయకుండా బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment