కిషన్‌రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే | Harishrao Comments On Kishan Reddy | Sakshi
Sakshi News home page

కిషన్‌రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే

Published Sun, Jun 18 2023 2:35 AM | Last Updated on Sun, Jun 18 2023 8:20 PM

Harishrao Comments On Kishan Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసహనంతో ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రానికి కేంద్ర నిధుల విషయంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ పేరిట పట్టపగలు పచ్చి అబద్ధాలు  చెప్పారని రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డికి కన్ఫ్యూజన్‌ ఎక్కువ కాన్సంట్రేషన్‌ తక్కువ అని ఎద్దేవా చేశారు. గతంలో కేంద్ర మంత్రి అమిత్‌ షా చెప్పిన అబద్ధాలనే కిషన్‌ ఇప్పుడు మళ్లీ చెప్పారని హరీశ్‌రావు పేర్కొన్నారు.

ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రానికి ఇచ్చే రుణాలు, బ్యాంకుల నుంచి ప్రజలు తీసుకున్న వ్యక్తిగత రుణాలను కేంద్రం ఖాతాలో వేసుకోవడానికి సిగ్గుండాలని విమర్శించారు. ఫైనాన్స్‌  కమిషన్‌ సిఫారసు చేసిన కేంద్ర పన్నుల్లో అన్ని రాష్ట్రాల వాటా 41శాతం కాగా కేవలం 30 శాతం మాత్రమే రాష్ట్రాలు పొందుతున్నాయని వివరించారు.

పన్నుల పంపిణీలో తెలంగాణ వాటా 2014–15లో 2.893 శాతం ఉండగా 2021–22 నాటికి 2.102 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు.  మిషన్‌ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఖాతాలో కిషన్‌రెడ్డి వేయడాన్ని ఖండించారు. 

తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదు 
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిహారం చెల్లించిందన్న వాదన సరికాదని, అది తెలంగాణ ప్రభుత్వం హక్కు అని పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం తోడ్పాటు ఇవ్వాల్సి ఉన్నా 2019–20, 2020–21, 2022–23 సంవత్సరాలకు ఎటువంటి మొత్తం విడుదల కాకపోవడంపై కిషన్‌ రెడ్డి సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

రాష్ట్రం నుంచి ఆహార ధాన్యాల సేకరణకు కేంద్ర ప్రభుత్వం రూ.1.58 లక్షల కోట్లు  ఖర్చు చేసిందని  కిషన్‌ రెడ్డి  చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. ఎరువుల కంపెనీకి ఇచ్చే సబ్సిడీని తెలంగాణ రైతులకు ఇచ్చే సబ్సిడీగా ఎలా పరిగణిస్తారని హరీశ్‌ ప్రశ్నించారు. 

గొప్పలు చెప్పేందుకు కిషన్‌రెడ్డి తిప్పలు 
లేని గొప్పులు చెప్పుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తిప్పలు పడుతున్నారని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. విభజన హామీల అమలుతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఆయన కేంద్రంపై పోరాటం చేయాలని కోరారు.

కిషన్‌ మాట్లాడిన  కొన్ని అబద్ధాలకు  మాత్రమే తాము ప్రస్తుతం సమాధానం ఇస్తున్నామని, ఆయన అబద్ధాల పుట్టను త్వరలోనే  పూర్తి ఆధారాలతో  కూడిన  పవర్‌  పాయింట్‌  ప్రెజెంటేషన్‌తో బద్దలు కొడతామని మంత్రి హరీశ్‌రావు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement