చండీగఢ్: హర్యానా కొత్త సీఎం నాయాబ్ సింగ్ సైనీ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో విజయం సాధించారు. మూజువాణీ ఓటు ద్వారా విశ్వాస పరీక్షలో నెగ్గారు. బీజేపీ ప్రభుత్వానికి అయిదుగురు జేజేపీ ఎమ్మెల్యేలు, ఆరుగురు స్వతంత్ర్య ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. ఇక 90 మంది సభ్యులున్న అసెంబ్లీలో 41 మంది బీజేపీ సభ్యులున్నారు. జేజేపీకి 10 మంది, కాంగ్రెస్‌కు 30 మంది, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌కు ఒక ఎమ్మెల్యే, హరియాణా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే, ఏడుగురు స్వతంత్ర్య ఎమ్మెల్యేలు ఉన్నారు.
కాగా మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో అనూహ్యంగా.. సైనీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తమ ప్రభుత్వానికి 48 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, బలనిరూపణకు బుధవారం అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలంటూ నూతన సీఎం సైనా గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు.
హరియాణాలో గడిచిన 48 గంటల్లో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి బీజేపీ సీనియర్ నేత మనోహర్‌లాల్ ఖట్టర్, మంత్రి వర్గం మొత్తం రాజీనామా చేయడం మొదలు ఓబీసీ నేత నాయబ్ సైనీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడందాకా మంగళవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్ధుబాటు విషయంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో దుష్యంత్ చౌతాలా సారథ్యంలోని జననాయక్ జనతా పార్టీ(జేజేపీ)తో విభేదాలు ముదరడంతో ఖట్టర్ సీఎం పదవిని వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఖట్టర్‌ను లోక్‌సభ ఎన్నికల్లో బరిలో నిలిపేందుకే బీజేపీ ఆయనను సీఎం పీఠం నుంచి దింపేసిందని మరో వాదన వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment