
రాంచీ: జేఎంఎం నేత హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టారు. గురువారం సాయంత్రం ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. భూకుంభకోణం కేసులో అరెస్టయి ఇటీవలే బెయిల్‌పై విడుదలైన హేమంత్.. 5 నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.
ల్యాండ్ స్కాం కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై జనవరి 31న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేశారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య.. అరెస్ట్ కంటే ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఫిబ్రవరి 2న చంపయీ సోరెన్ రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఐదు నెలల తర్వాత.. హేమంత్‌కు హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. దీంతో జూన్ 28న బిర్సా ముండా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఈ తరుణంలో బుధవారం చంపయీ సోరెన్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేలంతా సమావేశమై హేమంత్ సోరెన్‌ను తమ సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.

తొలుత జులై 7న ఆయన సీఎంగా ప్రమాణం చేస్తారనే ప్రచారం నడిచింది. అయితే ఆలస్యం చేయకుండా ఆయన గవర్నర్‌ను కలిసిన హేమంత్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి గవర్నర్ అంగీకారం లభించడంతో.. ఇవాళ సాయంత్రం జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా గురువారం సాయంత్రం ఆయన ప్రమాణస్వీకారం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment