న్యూఢిల్లీ: ‘కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లుగా మారుతాయి’ అనే సామెత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ విషయంలో అక్షర సత్యమైంది. ఏడాది క్రితం మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ జైలు పాలయ్యారు. ఇప్పుడే అదే హేమంత్ సోరెన్ మరోసారి సీఎం కుర్చీని అధిష్టించనున్నారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో హేమంత్ సోరెన్ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకుంటుంది. దీంతో హేమంత్ సోరెన్ సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు.
అయితే ఈ సందర్భంగా తన రాజకీయ జీవితంలో హేమంత్ సోరెన్ ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల్ని ఆయన పార్టీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. ఏడాది క్రితం జైలు పాలైన సోరెన్.. ఎన్నికల్లో సత్తా చాటి మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఏడాది క్రితం జైలు పాలైన సోరెన్
ఈ ఏడాది జనవరిలో భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన స్థానంలో తొలుత సోరెన్ భార్య కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రిని చేస్తారని ఊహాగానాలొచ్చాయి. దీనిపై సోరెన్ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. సోరెన్ సతీమణి కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు తాను వ్యతిరేకమంటూ సోరెన్ తోటికోడలు సీతా సోరెన్‌తో పాటు ఇతర కుటుంబసభ్యులు విభేధించారు. బీజేపీలో చేరారు. దీంతో ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సీనియర్ నేత, రవాణాశాఖ మంత్రి చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ప్రతిపక్షాలతో కలిసి హేమంత్ సోరెన్ కల్పనా సోరెన్ కేంద్రంపై తిరుగుబాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను చేపట్టారు.
హేమంత్ సోరెన్ అరెస్ట్ అయిన ఐదు నెలల తర్వాత ఈ ఏడాది జూన్‌లో జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రాథమికంగా విచారణలో నిర్ధోషిగా పరిగణించింది. ఇలాంటి నేరానికి పాల్పడే అవకాశం లేదని కోర్టు పేర్కొంది. దీంతో దాదాపు 5 నెలల అనంతరం జైలు నుంచి బయటకు వచ్చారు. తనను తప్పుడుగా ఇరికించారని.. రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తల గొంతు నొక్కుతున్నారని.. జైలు నుంచి విడుదలైన అనంతరం హేమంత్ ఆరోపించారు.
హేమంత్ సోరెన్ రాకతో చంపై సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. హేమంత్ సోరెన్ మరో మారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీన్ని జీర్ణించుకోలేని చంపై సోరెన్ జేఎంఎంకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. హేమంత్ సోరెన్ కాంగ్రెస్‌తో పాటు మిత్రపక్షాలతో కలిసి కూటమిగా ఏర్పడ్డారు. కల్పనా సోరెన్ ఒక్కరే 200పై చీలూకు ఎన్నికల ప్రచారాలతో హోరెత్తించారు.
ఇలా ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికి హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పనా సోరెన్ పార్టీని ముందుండి నడిపించారు. తాజా, ఎన్నికల్లో అద్భత ఫలితాల్ని రాబట్టారు. దీంతో రెండో దఫా సీఎంగా హేమంత్ సోరెన్ బాధ్యతలు చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment