తెలంగాణ కమల బృందంలో మార్పులుంటాయా? | BJP High Command Wants To Purge The Telangana BJP Party, See Details Inside - Sakshi
Sakshi News home page

తెలంగాణ కమల బృందంలో మార్పులుంటాయా?

Published Fri, Dec 8 2023 5:25 PM | Last Updated on Fri, Dec 8 2023 7:07 PM

High Command Wants To Purge The Telangana Bjp Party - Sakshi

బీజేపీ హైకమాండ్ తెలంగాణ కాషాయ పార్టీని ప్రక్షాళన చేయాలని భావిస్తోందా? ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో చర్చనీయాంశంగా మారిన అంశం. కమలం పార్టీ రాష్ట్ర సారథిగా ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. బీజేపీ హైకమాండ్ ఒత్తిడితో పార్టీ పగ్గాలు చేపట్టిన కిషన్ రెడ్డి శక్తి మేర కష్టపడ్డారు. ఎన్నికల్లో 8 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. అనూహ్యంగా ఓటు శాతాన్ని పెంచుకుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇతరులకు ఇవ్వాలని కిషన్ రెడ్డి పార్టీ అధిష్టానానికి విన్నవించుకున్నారు. రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై బీజేపీ హైకమాండ్ కసరత్తు మొదలుపెట్టింది.

తెలంగాణ కాషాయ దళపతిగా ఎవరికి ఛాన్స్ ఇస్తారనే దానిపై పార్టీలో విస్తృత చర్చ కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కొత్తగా ఎటువంటి ప్రయోగాలు చేయకుండా కంటిన్యూ కావాలని ఓ వైపు యోచిస్తోంది. అయితే రాష్ట్ర నేతల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారింది. రాష్ట్ర స్థాయి నేతలు ఎవరికి వారు సోషల్ మీడియాలో  సొంత పార్టీలో ప్రత్యర్థులను డీగ్రేడ్ చేస్తూ కామెంట్స్ పెట్టడం పార్టీకి తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇక పార్టీ ఫుల్ టైమర్ గా పనిచేసిన రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ వెళ్లిపోయిన తర్వాత... కొత్తగా ఎవరిని నియమించలేదు. దీంతో రాష్ట్ర పార్టీ నేతల సమన్వయం పెద్ద తలనొప్పిగా మారింది.

కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర పార్టీగా అధ్యక్షుడిగా అదనపు బాధ్యతలు మోస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు డా లక్ష్మణ్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులుగా, పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా ఉన్నారు. ఇక ఎంపీ బండి సంజయ్.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. వీరందరిని పక్కన పెట్టి కొత్త నేతను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.

గతంలో బండారు దత్తాత్రేయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  బీజేపీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శిగా పనిచేసి... మహారాజ్ గంజ్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు.  ఇటీవల మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా విష్ణుదత్త శర్మను నియమించింది. ఇతను ఏబీవీపీ జాతీయ సంఘటన కార్యదర్శి, ఫుల్ టైమర్ గా పనిచేశారు. అదేతరహాలో తెలంగాణ బీజేపీ పగ్గాలు... గతంలో ఇక్కడ రాష్ట్ర సంఘటన కార్యదర్శిగా పనిచేసిన మంత్రి శ్రీనివాస్ కు ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై జాతీయ పార్టీ కసరత్తు చేస్తున్నారు.  చండిఘడ్ కేంద్రంగా పంజాబ్ సంఘటన కార్యదర్శిగా పనిచేస్తున్న మంత్రి శ్రీనివాస్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తారా ? కొత్త ప్రయోగం చేస్తారా ? లేదా అన్నది చూడాలి.

మరోవైపు మధ్యప్రదేశ్ బీజేపీ ఇంఛార్జ్ గా ఉన్న మురళీధర్ రావు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ప్రయోగం చేస్తుందా ?  లేదా ? అన్నది చూడాలి.

ఇదీ చదవండి: వాళ్లు ఓడిపోవడం ఏమిటో? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement