సిమ్లా: బీజేపీని మరోసారి గెలిపించి, చరిత్ర తిరగరాయాలని ప్రధాని మోదీ హిమాచల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కమలం గుర్తుకు వేసే ప్రతి ఓటు తన ధైర్యాన్ని ఇనుమడింపజేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈ మేరకు ప్రధాని ఫొటో, సంతకంతో కూడిన లేఖను బీజేపీ శ్రేణులు ప్రతి ఇంటికీ వెళ్లి అందిస్తున్నాయి. ‘గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా మీరు బీజేపీనే ఆశీర్వదిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది.
కమలం గుర్తుపై మీరు వేసే ప్రతి ఓటుతో నా బలం పెరుగుతుంది’ అని హిందీలో రాసిన ఆ లేఖలో ఉంది. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన సరిహద్దు ప్రాంతాలు సహా రాష్ట్రాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేశాయని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి గమనం ముందుకు సాగించాలని ఓటర్లను ప్రధాని కోరారు. ఈ సందేశాన్ని వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలోని 15 లక్షల కుటుంబాలకు అందేలా చేస్తామని బీజేపీ నేత సంజయ్ టాండన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment