సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. 23,855 ఓట్ల ఆధిక్యంతో ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై భారీ విజయం సాధించారు. హుజూరాబాద్‌లో గెలుపొందిన సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య విలువలను హుజురాబాద్ ప్రజలు కాపాడారని, వారి రుణం తీర్చుకోలేనిదని అన్నారు.
ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే విధంగా ఎన్నికలు నిర్వహించలేదని మండిపడ్డారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఇప్పుడు స్వేచ్ఛగా నోరువిప్పే పరిస్థితి నియోజకవర్గంలో వచ్చిందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా కార్యకర్తలు ప్రజలు ఓర్చుకొని తనకు అండగా నిలిచారని అన్నారు. అఖండ విజయం అందించిన నియోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి దండం పెడుతున్నానని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు స్ఫూర్తినిచ్చారని అన్నారు. ఇక్కడ నడుస్తున్న రాజ్యం డబ్బులు రాజ్యమని, దోచుకున్న డబ్బులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. దళిత బంధు తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని, డబల్ బెడ్రూమ్ ఇల్లు సొంత భూమిలో కట్టుకోవడానికి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు నోటిఫికేషన్ జారీ చేయడం కోసం కొట్లాడుతానని అన్నారు. 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలని, రైతులు పండించిన ప్రతి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా టెంట్ వేసుకుని కూర్చున్నా వారి పక్షాన పోరాడుతానని అన్నారు. ఉద్యమకారుడిగానే తన పోరాట పంథాను కొనసాగిస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment