సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. టీఆర్‌ఎస్ ఓటమిపాలైన నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ.. ప్రజా తీర్పును శిరసావహిస్తామని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన ఓటర్లందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేమీ తగ్గలేదని, అయితే దేశంలో ఎక్కడలేని విధంగా హుజురాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీలు కల్సిపనిచేశాయని ఎద్దేవా చేశారు.
ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా చెప్తున్నారని, జాతీయ స్థాయిలో కొట్లాడే బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్ర స్థాయిలో కుమ్మక్కు కావడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎన్నికలో ఓటమితో కుంగిపోదని, గెలిచిననాడు పొంగిపోలేదని గుర్తుచేశారు. ఓడినా.. గెలిచినా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పనిచేస్తుందని హరీశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment