
ప్రచారంలో ఈటల సతీమణి జమున, వృద్ధురాలిని ఓటు అడుగుతున్న గెల్లు శ్వేత
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉపపోరు క్రమంగా ఊపందుకుంటోంది. తొలుత గెల్లు శ్రీనివాస్ యాదవ్ (టీఆర్‌ఎస్), తరువాత బల్మూరి వెంకట్ (కాంగ్రెస్), తాజాగా ఈటల రాజేందర్ (బీజేపీ) ప్రధాన పార్టీల అభ్యర్థులుగా ఉపపోరు బరిలో దిగారు. ప్రధానపార్టీల నుంచి అభ్యర్థుల ఎంపిక ఖరారైంది. ఈలోపే అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెట్టారు. మరికొందరు ఏకంగా అమలు చేసేస్తున్నారు. ఈ ముగ్గురు కూడా తమ ఇంటి మద్దతుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వారి భార్యలు, తల్లులు మద్దతుగా ప్రచారంలోకి రానున్నారు. ఈటల రాజేందర్ రాజీనామా నుంచి ఇప్పటి దాకా ఆయన సతీమణి ఈటల జమున ఆయన వెంటే ఉన్నారు. ఒకదశలో ఈటలకు మోకాలి నొప్పి తీవ్రమైన సమయంలో ఆయనకు వీలుకాని పక్షంలో తానే రంగంలోకి దిగాలనుకున్నారు.
చదవండి: హుజురాబాద్ ఉపఎన్నిక: రెండో డోసు సర్టిఫికెట్ ఉంటేనే రండి!
ఈలోపు రాజేందర్ కోలుకోవడంతో ఆయనకు మద్దతుగా జమున ప్రచారం ప్రారంభించారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ అభ్యర్థిత్వం ఆగస్టులోనే ఖరారైంది. కొన్నిరోజులుగా ఆయన భార్య గెల్లు శ్వేత కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. తన భర్తను గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఇక అందరి కంటే ఆఖరుగా కాంగ్రెస్ ప్రకటించిన బల్మూరి వెంకట్ తల్లి బల్మూరి పద్మ కూడా ప్రచారబరిలోకి త్వరలోనే రానున్నారు. ఉప ఎన్నిక సమరభేరికి వెళ్లే కుమారునికి ఓ తల్లి, తమ భర్తలకు భార్యలు వీరతిలకం దిద్దారు. ఎన్నికల ప్రచార పోరులోనూ భాగస్వాములవుతూ మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ముందుకు సాగుతున్నారు.
చదవండి: హుజూరాబాద్ ఉప ఎన్నిక: ఉత్సాహవంతులకు ఊహించని దెబ్బ
గెల్లు ఉద్యమం కొనసాగుతుంది
20 ఏళ్లుగా నా భర్త విద్యార్థి నాయకుడిగా తెలంగాణ కోసం పోరాడాడు. ఏనాడూ ఏ పదవీ ఆశించలేదు. పేదింటి ఉద్యమకారుడు, నిజాయితీగా పనిచేయడమే తెలుసు. అందుకే.. సీఎం ఇక్కడ పోటీ చేసే అవకాశం కల్పించారు. గతంలో రాష్ట్ర సాధన కోసం పోరాడిన నా భర్త, భవిష్యత్తులో కేసీఆర్ అండదండలతో నియోజకవర్గ అభివృద్ధికి అదే సంకల్పంతో పోరాటం చేస్తాడు.
– గెల్లు శ్వేత యాదవ్
హుజూరాబాద్ ప్రజలు చైతన్యవంతులు
హుజూరాబాద్ ప్రజలు చాలా చైతన్యవంతులు. డబ్బుకు అమ్ముడు పోయేవారు కాదు. దళిత కాలనీలలో రూ.10 లక్షలు కాదు ఉద్యోగం కావాలని అడుగుతున్నారు. ట్రాక్టర్లు, కార్లు ఇస్తే చదువుకున్న వాళ్లు వాటికి డ్రైవర్లుగా పనిచేయాలా అని నిలదీస్తున్నారు. హుజూరాబాద్‌కు వస్తున్న ప్రతీ పథకం ఈటల రాజేందర్ రాజీనామా వల్లనే. తమ్ముడు తమ్ముడు అని కేసీఆర్ తడిగుడ్డతో గొంతుకోశారు. అందుకే.. రాజేందర్‌ను గెలిపించాలి.
– ఈటల జమునప్రభుత్వ వైఖరిని ఎండగడతా
ఈనెల 8వ తేదీ నుంచి నేను ప్రచారంలో పాల్గొంటా. రాష్ట్రంలో ఉద్యోగాలు రాకుండా బాధ పడుతున్న అయోమయంలో పడేసింది. ప్రభుత్వ వైఖరిని ప్రతీ తల్లికి తండ్రికి తెలిసేలా అందరినీ ఏకం చేస్తూ ప్రచారంలో ముందుకు వెళతాం. నా బిడ్డ విజయానికి నా వంతుగా కృషి చేస్తా.
– బల్మూరి పద్మ
Comments
Please login to add a commentAdd a comment