సాక్షి, ప్రతినిధి: రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌నకు గురైన ఈటల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయం రంగులు మారుతోంది. 2004 నుంచి ఈటలకు కంచుకోటగా నిలిచిన ఈ నియోజకవర్గంలో ఆయనను రాజకీయంగా దెబ్బకొట్టే దిశగా టీఆర్‌ఎస్ నాయకత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రాజేందర్‌కు ప్రజల్లో, కార్యకర్తల్లో ఉన్న బలాన్ని పలుచన చేయడంతో పాటు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని పెంచే దిశగా పావులు కదుపుతున్నాయి. హుజురాబాద్‌నియోజకవర్గం బాధ్యతలను భుజాల మీద వేసుకున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తొలుత స్థానిక ప్రజాప్రతినిధులను ఈటలకు దూరం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు.
ఇటీవల జమ్మికుంట, ఇల్లందకుంట మండలాలకు చెందిన కొందరు నాయకులతో మాట్లాడిన ఆయన.. గురువారం హుజురాబాద్ మున్సిపాలిటీకి చెందిన ప్రజాప్రతినిధులు, మహిళా కౌన్సిలర్ల భర్తలను 11 మందిని కరీంనగర్‌కు పిలిపించి చర్చలు జరిపారు. మున్సిపాలిటీలోనే కాకుండా నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా తానున్నానని వారికి హామీ ఇచ్చారు. నాయకులు శాశ్వతం కాదని, పార్టీ నీడలో ఉండి ప్రజలకు సేవ చేయాలని హితవు చెప్పారు. లాక్‌డౌన్ తర్వాత మంత్రి కేటీఆర్‌తో కలిసి హుజురాబాద్‌లో పర్యటిస్తానని, ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా ఉన్నారని వివరించారు.
మంత్రిని కలిసిన వారిలో కొలిపాక శ్రీనివాస్(వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల భర్త), కేసిరెడ్డి నర్సింహారెడ్డి(కౌన్సిలర్ లావణ్య భర్త), ఆర్‌కె రమేశ్(కౌన్సిలర్ ఉమాదేవి భర్త), పూర్ణచందర్(కౌన్సిలర్ సృజన భర్త), ఇమ్రాన్(కౌన్సిలర్ ఉజ్మానూహరిన్ భర్త), అనిల్(కౌన్సిలర్ రాజకొమురయ్య కుమారుడు), కౌన్సిలర్లు తొగరు సదానందం, తోట రాజేంద్రప్రసాద్, తాళ్లపల్లి శ్రీనివాస్, ముక్కపల్లి కుమార్, కొండాల్‌రెడ్డి ఉన్నారు.
చిల్లర వార్తలు నమ్మొద్దన్న ఈటల
సోషల్ మీడియాలో, కొన్ని పత్రికల్లో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని చిల్లర వార్తలుగా అభివర్ణిస్తూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తిప్పికొట్టారు. తన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశానని, కరోనా మహమ్మారి ప్రబలిన ఈ సమయంలో రాజకీయాలను పక్కనపెట్టి ప్రజలను ఆదుకునే పనిలో నిమగ్నమైనట్టు చెప్పారు. కరోనా తగ్గుముఖం పట్టిన వెంటనే తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ముందుకు సాగుతానని గురువారం విడుదల చేసిన ఓ వీడియో ద్వారా తెలియజేశారు.
అంతుచిక్కని కౌశిక్ రాజకీయం
హుజురాబాద్ కాంగ్రెస్ నేత, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీప బంధువు పాడి కౌశిక్‌రెడ్డి రాజకీయం ఏంటో కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంతుచిక్కడం లేదు. పార్టీల నాయకుల అభిప్రాయానికి భిన్నంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను భూకబ్జాదారుడిగా తెరపైకి తెస్తూ తూర్పార పడుతున్న కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి తన చర్యలకు కట్టుబడి ఉంటున్నట్లు గురువారం గురువారం ఓ వీడియో విడుదల చేశారు. తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు సాగుతున్న ప్రచారాన్ని ఖండించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. అదే సమయంలో ఈటల భూదందాలను వెలుగులోకి తెస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను వేధింపులకు గురిచేసిన ఈటల రాజేందర్ వదిలే సమస్య లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment