కిషన్ రెడ్డికి తెలంగాణపై ప్రేమ ఉంటే ఆ పని చేయాలి: హరీష్‌ రావు | Hyderabad: Harish Rao Slams Union Minister Kishan Reddy | Sakshi
Sakshi News home page

కిషన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి: మంత్రి హరీష్‌ రావు..

Published Thu, Nov 11 2021 6:02 PM | Last Updated on Fri, Nov 12 2021 4:19 AM

Hyderabad:  Harish Rao Slams Union Minister Kishan Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అబద్ధాలను ప్రచారం చేయ డంలో రాష్ట్ర బీజేపీ నాయకులతో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పోటీ పడుతున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. కేంద్ర మంత్రి హోదాలో ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశం, ట్విట్టర్‌లో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం ఇచ్చిన కిషన్‌రెడ్డి, రాష్ట్ర ప్రజ లకు క్షమాపణ చెప్పి హుందాతనం కాపాడుకోవాలని అన్నారు.

గురువారం తెలంగాణ భవన్‌లో.. టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డి, భరత్‌కుమార్‌ గుప్తా, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీల ఏర్పా టు, హైదరాబాద్‌లో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) ఏర్పాటుకు స్థలం అప్పగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎయిమ్స్‌ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా శాశ్వత భవనంతో పాటు 201.24 ఎకరాల భూమిని అప్పగించిందని తెలిపారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌కు గత ఏడాది మే 10న బీబీనగర్‌ తహసీల్దార్‌ ఈ మేరకు భూమి పత్రాలు కూడా అప్పగించారన్నారు. బీబీనగర్‌ మండలం కొండ మడుగులో 49.25 ఎకరాలు, రంగాపూర్‌లో 151.29 ఎకరాల భూమి అప్పగింతకు సంబంధించిన పత్రాలను మంత్రి విడుదల చేశారు.  

చదవండి: ఒకటి, రెండు కాదు..శనగ వయసు ఏకంగా 12,600 ఏళ్లు

రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి అసత్యాలా? 
రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీల ఏర్పాటు విషయంలో కేంద్రానికి అనేకమార్లు లేఖలు రాసి, విజ్ఞప్తి చేసినా.. కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కలవలేదని కిషన్‌రెడ్డి ప్రకటించడం బాధ్యతారాహిత్యమని హరీశ్‌రావు పేర్కొన్నారు. 2015 జూన్‌ 21న నాటి కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డాను టీఆర్‌ఎస్‌ ఎంపీలతో పాటు అప్పటి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి కలిసి.. జిల్లా ఆసుపత్రులను ఆప్‌గ్రేడ్‌ చేసి మెడికల్‌ కాలేజీలు మంజూరు చేయాల్సిందిగా కోరారని గుర్తుచేశారు. అయితే తెలంగాణలో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు అర్హత కలిగిన ఆసుపత్రులు లేవనే సాకును అప్పట్లో కేంద్రం చూపిందన్నారు. ఆ తర్వాత కూడా కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా మెడికల్‌ కాలేజీలు ఇవ్వలేదన్నారు.

ఇటీవల మం జూరు చేసిన 157 మెడికల్‌ కాలేజీల్లో సైతం తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా ఇవ్వకుండా కేం ద్రం మొండిచేయి చూపిందన్నారు. ఉమ్మడి రాష్ట్రం లో కేవలం 5 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉండగా, కేంద్రం మంజూరు చేయకున్నా సీఎం కేసీఆర్‌ చొరవతో ప్రస్తుతం ఈ కాలేజీల సంఖ్య 21కి చేరిందన్నారు. రాష్ట్రానికి మరో 12 మెడికల్‌ కాలేజీలు అవసరమున్నాయని, కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి మంజూరు చేయిస్తే 40 శాతం నిధులు భరిం చేం దుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు. కిషన్‌రెడ్డి అబద్ధాలు మాట్లాడటం సరికాదన్నారు. తనకు సరైన సమాచారం ఇచ్చేలా కేంద్ర మంత్రి సరైన బృందాన్ని పెట్టుకోవాలని సలహా ఇచ్చారు.  
చదవండి: వైద్యారోగ్య శాఖపై మంత్రి హరీష్‌ సమీక్ష.. కీలక నిర్ణయాలు

విదేశాంగ విధానం మార్చండి 
రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ గోబెల్స్‌ ప్రచారం చేస్తోందని, ఇందులో భాగంగానే కిషన్‌రెడ్డి కూడా ఇటీవల అబద్ధాలు చెబుతున్నారని హరీశ్‌రావు విమర్శిం చారు. రాష్ట్రంలో వడ్ల కొనుగోలుకు అనుమతిస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులు తెస్తే విమానాశ్రయానికే వచ్చి సన్మానం చేస్తామని ప్రకటించారు. పంజా బ్‌లో పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణలోనూ సేకరించాలన్నారు. బియ్యం ఎగుమతులకు వీలుగా విదేశాంగ విధానం మార్చాలని, పారిశ్రామికవేత్తలకు రుణాలు మాఫీ చేసిన కేంద్రం.. రైతులకు కూడా సబ్సిడీ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వరి ధాన్యం కొనొద్దని ఓ వైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్తుండగా, మరోవైపు రాష్ట్ర బీజేపీ మాత్రం ధాన్యం కొనాలని ధర్నా చేస్తోందని విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement