తెలంగాణకు ఎయిమ్స్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి ఎయిమ్స్ మంజూరు చేయించేందుకుబీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హామీ ఇచ్చినట్టు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడి అనుబంధ బడ్జెట్‌లో ఎయిమ్స్ మంజూరు చేయిస్తానని భరోసా ఇచ్చారని చెప్పారు. శనివారం ఢిల్లీ ఏపీ భవన్‌లో బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి శ్రీరామ్ వెదిరే, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లులోని అంశాల ప్రాతిపదికన ఏపీకి నిధులు, ప్రాజెక్టులు వచ్చాయని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో అభివృద్ధికి కేంద్రంతో సమన్వయం కోసం పార్టీ తరఫున ఇన్‌చార్జిలను నియమిస్తామన్నారు. రుణమాఫీపై బ్యాంకర్లతో స్పష్టమైన ఒప్పందం చేసుకోని కారణంగా రైతులకు రుణాలు ఇవ్వడం లేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు విషయంలో విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు. ఏపీ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం, తెలంగాణ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తే, హైదరాబాద్‌లో దశాబ్దాల నుంచి ఉంటున్న మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాల వారికి ఫీజు రీయింబర్‌సమెంట్ ఎవరు ఇస్తారు? దీనిపై చంద్రబాబు, కేసీఆర్‌లు చర్చించుకుని పరిష్కారాన్ని చూపాలని కోరారు. రూ.1,250 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషను ఇవ్వడమనేది బుజ్జగింపు చర్య అని, మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడతామని కిషన్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో చాలాచోట్ల అక్రమ నిర్మాణాలు ఉన్నాయనీ, ఒవైసీ ఆస్పత్రి కూడా అక్రమ కట్టడమేనని ఆరోపించారు. అయితే, ఆక్రమణలను తాము సమర్థించేది లేదని, వాటికి అనుమతులిచ్చిన ప్రభుత్వాధినేతలపై, అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ కేంద్రంతో సఖ్యతగా ఉండాలని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పట్టభద్రులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేయండి: అమిత్‌షా
తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి సంస్థాగతంగా బలోపేతం చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. శనివారం కిషన్ రెడ్డి సహా పలువురు నేతలు ఢిల్లీలో ఆయన్ను కలసి అభినందించారు. దక్షిణాదిన కర్ణాటక తర్వాత తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, దీని కోసం ఇప్పటి నుంచే పకడ్బందీ కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సూచించారు. పోలవరం నిర్వాసితులైన గిరిజనులకు న్యాయం జరిగేలా అవసరమైతే పోరాటాలు చేయాలని సూచించినట్టు సమాచారం. ఆగస్టులో నిర్వహించనున్న పార్టీ రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు రావాల్సిందిగా అమిత్‌షాను కిషన్‌రెడ్డి ఆహ్వానించగా.. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.