సాక్షి, చెన్నై: ప్రాణం ఉన్నంత కాలం రాజకీయాల్లో కొనసాగుతానని విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమలహాసన్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం కమల్ ట్వీట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యంకు ఎదురైన పరాజయం గురించి తెలిసిందే. కమలహాసన్ సైతం ఓటమి పాలయ్యారు. ఈ పరిణామాలు మక్కల్ నీది మయ్యంలో చిచ్చు రగిల్చింది. ప్రధానంగా కూటమి విషయంలో కమల్ తప్పటడుగు వేశారంటూ ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు విమర్శలు గుప్పించడమే కాదు, పార్టీని వీడే పనిలో పడ్డారు. అగ్ర నేతలు ఒకరి తర్వాత మరొకరు బయటకు వెళ్తుండటంతో మక్కల్ నీది మయ్యం గుడారం త్వరలో ఖాళీ కావడం తథ్యం అన్న సంకేతాలు వెలువడ్డాయి. అలాగే, కమల్ రాజకీయాల నుంచి వైదొలగేనా అన్న చర్చ జోరందుకుంది. ఈ పరిస్థితుల్లో సోమవారం కమల్ ఓ ట్విట్ చేశారు.
ప్రాణం ఉన్నంత వరకు తాను రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు. మక్కల్ నీది మయ్యం నుంచి ఎందరు బయటకు వెళ్లినా, తాను మాత్రం రాజకీయ పయనాన్ని వీడబోనని స్పష్టం చేశారు. కూటమి ఏర్పాటు సమయంలో నోరు మెదపని వాళ్లు ఇప్పుడు కుంటి సాకులు చెప్పడం శోచనీయమని విమర్శించారు. పూర్వ కాలంలో వ్యాపారులు ఓ చోట పని ముగించుకుని మరో చోటకు వెళ్లడం జరుగుతూ వచ్చేదని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఇక్కడ వ్యాపారం లేని దృష్ట్యా, మరో చోటకు వెళ్తున్నట్టుందని బయటకు వెళ్లిన వారిని ఉద్దేశించి విమర్శించారు. ఎంత మంది బయటకు వెళ్లినా, తాను మాత్రం రాజకీయ పయనాన్ని కొనసాగిస్తానని, కేడర్ అథైర్య పడ వద్దు అని, మరింత ఉత్సాహంగా పనిచేద్దామని, మరింత బలాన్ని పంజుకునే రీతిలో శ్రమిద్దామని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment