
పాట్నా: బిహార్‌లో రాజకీయం రసవత్తరంగా మారిన వేళ నితీశ్‌కుమార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 100 మంది ఆల్ ఇండియా సర్వీసు అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పు రాబోతోందని స్పష్టమైన సంకేతాలిచ్చినట్లయింది.
రాష్ట్రంలో మొత్తం 22 మంది ఐఏఎస్, 79 మంది ఐపీఎస్, 45 మంది గ్రూప్ 1 స్థాయి అధికారులను నితీశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో అయిదుగురు జిల్లా కలెక్టర్లుండగా 17 మంది జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ)లు ఉన్నారు. పాట్నా డీఎం చంద్రశేఖర్ సింగ్‌ను సీఎంవో స్పెషల్ సెక్రటరీగా నియమించారు.
కాగా, జనతాదళ్ యునైటెడ్ చీఫ్, సీఎం నితీశ్‌కుమార్ ఆర్జేడీని వదిలి బీజేపీతో కలిసి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. నితీశ్ తన సీఎం పదవికి రాజీనామా చేసి బీజేపీతో కూటమి కట్టి తిరిగి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా ఉన్నతాధికారుల బదిలీలు జరగడం నితీశ్ కూటమి మార్చడం ఖాయమన్న వాదనకు ఊతమిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment