Nitish Kumar government
-
బిహార్ పాలిటిక్స్.. నితీశ్ సర్కారు కీలక నిర్ణయం
పాట్నా: బిహార్‌లో రాజకీయం రసవత్తరంగా మారిన వేళ నితీశ్‌కుమార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 100 మంది ఆల్ ఇండియా సర్వీసు అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పు రాబోతోందని స్పష్టమైన సంకేతాలిచ్చినట్లయింది. రాష్ట్రంలో మొత్తం 22 మంది ఐఏఎస్, 79 మంది ఐపీఎస్, 45 మంది గ్రూప్ 1 స్థాయి అధికారులను నితీశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో అయిదుగురు జిల్లా కలెక్టర్లుండగా 17 మంది జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ)లు ఉన్నారు. పాట్నా డీఎం చంద్రశేఖర్ సింగ్‌ను సీఎంవో స్పెషల్ సెక్రటరీగా నియమించారు. కాగా, జనతాదళ్ యునైటెడ్ చీఫ్, సీఎం నితీశ్‌కుమార్ ఆర్జేడీని వదిలి బీజేపీతో కలిసి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. నితీశ్ తన సీఎం పదవికి రాజీనామా చేసి బీజేపీతో కూటమి కట్టి తిరిగి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా ఉన్నతాధికారుల బదిలీలు జరగడం నితీశ్ కూటమి మార్చడం ఖాయమన్న వాదనకు ఊతమిస్తోంది. ఇదీచదవండి.. నితీశ్ కొత్త అవతారం -
శాఖ మార్చిన కాసేపటికే.. బిహార్ మంత్రి రాజీనామా
పాట్నా: కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ నేత, బిహార్ న్యాయశాఖ మంత్రి కార్తీక్ కుమార్ బుధవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు కార్తీక్ కుమార్ తన రాజీనామాను గవర్నర్‌కు పంపగా.. ఆయన ఆమోదించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కాగా 2014లో జరిగిన ఓ కిడ్నాప్ కేసులో మంత్రి నిందితుడిగా ఉండటంతో విపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళనలు చేశాయి. ఈ నిరసనల నేపథ్యంలో కార్తీక్ కుమార్‌ను.. బిహార్ సీఎం నితిష్ కుమార్ న్యాయశాఖ మంత్రి బాధ్యతల నుంచి తప్పించి.. ఆయనకు తక్కువ ప్రాధాన్యత కలిగిన చెరుకు శాఖను అప్పగించారు. అయినప్పటికీ ఆందోళనలు కొనసాగడంతో కొత్త శాఖను కేటాయించిన గంటల వ్యవధిలోనే కార్తీక్ కుమార్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కార్తీక్ కుమార్ రాజీనామాతో.. రెవెన్యూశాఖ మంత్రి అలోక్ కుమార్ మెహతాకు చెరుకు శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక బిహార్‌లో బీజేపీ కూటమి నుండి వైదొలిగిన జేడీయూ అధినేత నితీష్ కుమార్.. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు కార్తీక్ కుమార్. బిహార్‌లో రాజకీయంగా శక్తివంతమైన భూమిహార్ అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి కావడంతో ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. చదవండి: భారత్‌లో కొత్తగా 7 వేల కరోనా కేసులు -
అందుకే సీట్లు తక్కువొచ్చినా సీఎం పదవి: నితీశ్ కుమార్
పాట్నా: బిహార్‌లో బీజేపీకి టాటా చెప్పి తన పాత స్నేహితులతో కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్ కుమార్. ఈ క్రమంలో బీజేపీ, జేడీయూ మధ్య మాటల యుద్ధం మొదలైంది. నితీశ్ కుమార్ అసలు సీఎం పదవికి తగిన వ్యక్తి కాదంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో 2020లో బీజేపీతో పోలిస్తే తనకు తక్కువ సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం వెనుకున్న కారణాలను బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీ వేదికగా వెల్లడించారు నితీశ్ కుమార్. విపక్ష నేతలతో చేతులు కలిపి నితీశ్ ద్రోహం చేశారంటూ బీజేపీ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ పలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. ‘ 2020 ఎన్నికల్లో బీజేపీతో పోలిస్తే తక్కువ సీట్లు వచ్చినా.. నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యాను. కానీ, సీఎం పదవిలో కొనసాగేందుకు నాపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. నేనే ముఖ్యమంత్రినని వారు చెప్పారు. నాకు ముఖ్యమంత్రి పదవి వద్దని చెప్పాను. మీరు ఎక్కువ సీట్లు గెలిచారు.. మీ పార్టీ నుంచే ముఖ్యమంత్రి ఉండాలని సూచించాను. చివరకు అంగీకరించాను. కానీ, ఆ పదవిని ఒత్తిడిలో చేపట్టాను. నంద్ కిషోర్ యాదవ్‌ను స్పీకర్‌గా చేస్తారని నాకు చెప్పారు. పాత మిత్రుడని.. బావుంటుందని చెప్పాను. కానీ, అతను కాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఓ వ్యక్తిని కింది స్థాయి నుంచి తీసుకొచ్చి కేంద్రంలోకి పంపిస్తే నాకే ద్రోహం చేశాడు.’ అని పేర్కొన్నారు నితీశ్. ముఖ్యమంత్రి రేసులో ఉన్న బీజేపీ నేతలు సుశీల్ కుమార్ మోదీ, ప్రేమ్ కుమార్ పేర్లను సైతం వెల్లడించారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటంపై బీజేపీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు నితీశ్ కుమార్. 2017లో ఆర్జేడీని వీడి బీజేపీతో చేతులు కలిపిన అంశాన్ని లేవనెత్తుతూ విమర్శలు చేయటంపై స్పష్టత ఇచ్చారు. ‘2017లో వారి నుంచి విడిపోయాను. మీరు చాలా ఆరోపణలు చేశారు. కానీ ఐదేళ్ల గడిచినా వారికి వ్యతిరేకంగా ఏమీ కనిపించలేదు.’ అని స్పష్టం చేశారు నితీశ్. ఇదీ చదవండి: Bihar Floor Test: బల పరీక్షలో నెగ్గిన నితీష్ ప్రభుత్వం.. బీజేపీపై అటాక్ -
ఆహా ఏమి రుచి...తినరా సమోసా మైమరచి!
ఆహా ఏమి రుచి.. తినరా సమోసా మైమరచి.. అంటూ బ్రిటన్ వాసులు పాడేసుకుంటున్నారు. కాస్త కరకరలాడుతూ, కాస్త మెత్తమెత్తగా ఉండే సమోసాకు బ్రిటన్ వాసులు ఫిదా అయిపోయారు. ఏకంగా సమోసా వారోత్సవాలనే నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 9 నుంచి 13 వరకు యూకేలోని ఆరు నగరాల్లో జాతీయ సమోసా వారోత్సవాలు జరిగాయి. అందులో సమోసా ఈటింగ్ పోటీలు, ఉత్తమ సమోసాకు అవార్డులు, కొత్త కొత్త సమోసా రెసీపీల పరిచయం వంటి కార్యక్రమాలూ జరిగాయి. కేవలం ఆలూ సమోసాయే కాదు ఉల్లి, బఠాణి, పంజాబీ చోలే సమోసా, హైదరాబాదీ కీమా సమోసా వంటి 20 రకాల సమోసాలెన్నో అందుబాటులో ఉన్నాయి. అసలు ఈ సమోసా చుట్టూ అల్లుకున్న వింతలు, విశేషాలు ఎంతో ఆసక్తికరం.. అవేమిటో తెలుసుకుందామా? - సమోసా అంటే మనందరికీ ఇష్టమే. అయితే ఇది భారతీయ వంటకం కాకపోవడం గమనార్హం. పదో శతాబ్దానికి ముందు మధ్య ప్రాచ్య దేశాల్లో సమోసా పుట్టింది. అక్కడి నుంచి మధ్య ఆసియా దేశాల మీదుగా 14వ శతాబ్దంలో భారత్‌కు పరిచయమైంది. అంతే అప్పట్నుంచి భారతీయుల మెనూలో శాశ్వతంగా చేరిపోయింది. - సమోసా అన్న పదం పర్షియన్ భాషలోని సంబోసాగ్ అన్న పదం నుంచి వచ్చింది. అఫ్గాన్లు సంబోసా అని పిలిస్తే, తజికిస్తాన్లో సంబూసా అని, టర్కీలో సంసా అని అంటారు. - మొఘల్ చక్రవర్తి అక్బర్ నుంచి.. ఇప్పటి అబ్దుల్ కలామ్ వరకు ఎందరో ప్రముఖులు సమోసా రుచికి మైమరచిపోయిన వారే. అక్బర్ తన రాజధాని ఫతేపూర్ సిక్రీలోని ఒక భవనానికి ఏకంగా సమోసా మహల్ అని పేరు పెడితే... భారత్‌కున్న బలాల్లో సమోసా కూడా ఒకటంటూ కలాం తన అడ్వాంటేజ్ ఇండియా పుస్తకంలో శ్లాఘించడం గమనార్హం. - చరిత్రలోనే కాదు.. అంతరిక్షంలోనూ సమోసా ఘుమఘుమలాడిపోయింది. వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు తన వెంట తీసుకువెళ్లిన ఆహార పదార్థాల్లో సమోసా కూడా ఉంది. - సమోసా చిరు తిండా లేదా ఒక వంటకమా అన్న అంశంపై వివాదం నెలకొని కోర్టుకు కూడా చేరింది. ఉత్తరాఖండ్‌లో ఒక దుకాణదారు సమోసా అన్నది చిరుతిండేనని, అందువల్ల దానిపై పన్ను ఐదు శాతం మాత్రమే ఉండాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ వాణిజ్య పన్నుల శాఖ అదొక వంటకమని, దానిపై ఎనిమిది శాతం పన్ను ఉండాలంటూ వాదించింది. చివరికి న్యాయస్థానం సమోసా చిరుతిండి కాదని తేల్చేసింది. - ఇక సమోసా పేరు చెబితే బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పేరు చటుక్కున గుర్తుకొస్తుంది. ‘జబ్‌తక్ రహేగా సమోసామే ఆలూ.. తబ్‌తక్ బిహార్‌లో రహేగా లాలూ (సమోసాలో ఆలూ ఉన్నంతకాలం.. బిహార్‌లో లాలూ ఉంటారు)’అంటూ ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు గుర్తుండిపోతాయి మరి. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అదే లాలూ మిత్రపక్షంగా ఉన్నప్పుడు బిహార్‌లో నితీశ్‌కుమార్ ప్రభుత్వం సమోసాలపై 13.5 శాతం లగ్జరీ పన్ను విధించింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. - గతేడాది కొందరు సమోసా ప్రియులు లండన్‌లో 153 కేజీల అతి పెద్ద సమోసాను తయారు చేసి గిన్నిస్‌బుక్ రికార్డు సృష్టించారు. -
లాలు కొడుకుపై విష ప్రయోగం?
పట్నా: నితీష్‌కుమార్ ప్రభుత్వంపై ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, బీహార్ అసెంబ్లీ విపక్ష నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చేస్తున్న యాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వం తనను చంపాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే తాను తినే ఆహారంలో విషం కలపాలని ప్రయత్నించిందన్నారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న వేళ, ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్క్యూట్ హౌస్ లలో బస చేస్తుంటానని, అక్కడ విషం కలిపే ప్రయత్నాలు జరిగాయన్నారు. ఈ విషయం ప్రభుత్వంలో తనకున్న విశ్వసనీయ వర్గాల నుంచి తెలిసిందని తేజస్వీ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. "ఫోన్ ట్యాపింగ్ తరువాత నాపై హత్యా ప్రయత్నాలు జరిగాయి. నా ర్యాలీలకు వస్తున్న ప్రజలను చూసిన ప్రభుత్వానికి భయం వేసి ఈ పని చేయాలని ప్రయత్నించింది" అని ఆయన మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితమే తన ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆరోపించిన ఆయన, తన యాత్రకు వస్తున్న ప్రజా స్పందనను ప్రభుత్వం తట్టుకోలేక పోతోందని కూడా వ్యాఖ్యానించారు. ఇక వచ్చె నెలలో బీహార్‌లో ఒక లోక్ సభ, రెండు అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తేజస్వీయాదవ్ యాత్ర చేపట్టారు. ఈ ఆరోపణలపై నితీష్ ప్రభుత్వం స్పందించింది. తేజస్వీ హద్దులు దాటి మాట్లాడుతున్నారని మండిపడింది. ఉపఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని జేడీయూ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ తెలిపారు. ఆర్జేడీ,జేడియూ,కాంగ్రెస్‌ల కూటమితో ఏర్పడిన ప్రభుత్వం చీలిపోయిన విషయం తెలిసిందే. ఉపముఖ్యమంత్రిగా తేజస్వీయాదవ్పై అవినీతి ఆరోపణలు రావడంతో గతేడాదే సీఎం నితీష్ కుమార్ కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో జతకట్టారు. -
‘షాబుద్దీన్ బెయిల్ రద్దు చేయండి’
పట్నా: పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఆర్జేడీ మాజీ ఎంపీ, డాన్ మొహమ్మద్ షాబుద్దీన్ బెయిల్ రద్దు కోరుతూ నితీశ్ కుమార్ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవలే షాబుద్దీన్‌కు పట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 2004 సంవత్సరంలో ఇద్దరు సోదరులను హత్య చేసిన కేసులో షాబుద్దీన్ 11 ఏళ్ల జైలు శిక్ష అనంతరం ఆయన గత వారమే బెయిలుపై విడుదల అయ్యారు. కాగా ఇంటా, బయటా విమర్శలు రావటంతో షాబుద్దీన్ బెయిల్ రద్దు చేయాలంటూ నితీశ్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ సోమవారం విచారణ జరగనుంది. మరోవైపు బాధితుల తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా షాబుద్దీన్ బెయిల్‌ను సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా నితీష్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రి అయినా తన నాయకుడు మాత్రం లాలు ప్రసాద్ యాదవేనని, ఆయనకు మాత్రమే తాను విధేయుడినని షాబుద్దీన్ అన్నాడు. తాను మళ్లీ జైలుకు వెళ్లేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. -
పట్నాలో కన్హయ్యకు ఘనస్వాగతం
పట్నా: జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌కు ఆయన స్వరాష్ట్రమైన బిహార్‌లో శనివారం రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. రాజద్రోహం కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయనకు నితీశ్ కుమార్ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. ఢిల్లీ నుంచి పట్నా విమానాశ్రయానికి చేరుకున్న ఆయన పోలీసుల రక్షణలో నగరంలోకి చేరుకున్నారు. సీఎం నితీశ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌లతో వారి నివాసాల్లో భేటీ అయ్యారు. తర్వాత బేగుసరాయ్ జిల్లాలోని తనింటికి వెళ్లారు. కాగా, రాజద్రోహం అభియోగాలున్న కన్హయ్యకు ప్రభుత్వం ఘన స్వాగతం పలకడం రాష్ట్రానికి సిగ్గుచేటని విపక్ష బీజేపీ ఆరోపించింది. అయితే రాష్ట్రవాసి అయిన కన్హయ్యపై ఢిల్లీలో దాడి జరిగిందని, ఆయనకు లోపరహిత భద్రత కల్పించం తప్పుకాదని రాష్ట్ర మంత్రి, అశోక్ చౌధురి అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలో అసహనం పెరిగిందని కన్హయ్య ఆరోపించారు.అఫ్జల్ ఉరితీతకు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించి జేఎన్‌యూ తనకు వేసిన రూ. 10వేల జరిమానాను చెల్లిస్తామని ముంబై మునిసిపల్ కార్మికులు చెప్పారని తెలిపారు. వారు రూ. 10వేలు సేకరించారని, అయితే జరిమానా కట్టబోమన్నారు. -
జేడీయూకు బీహార్ మంత్రి గుడ్ బై
పాట్నా: లోక్‌సభ ఎన్నికల ముందు బీహార్‌లో అధికార పార్టీ జేడీయూ, నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పర్వీన్ అమానుల్లా మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. పర్వీన్ నితీష్ కుమార్ కేబినెట్ నుంచి వైదొలగడంతో పాటు జేడీయూకూ గుడ్ బై చెప్పారు. ఆమె తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం, పార్టీలో కొనసాగలేకపోతున్నానని చెప్పారు. రాజకీయాలకు దూరంగా ప్రజా సేవ చేయనున్నట్టు పర్వీన్ తెలిపారు. ఆమె భర్త అఫ్జల్ అమానుల్లా సీనియర్ ఐఏఎస్ అధికారి. కేంద్ర ప్రభుత్వం సర్వీసులో పనిచేస్తున్నారు. ఇదిలావుండగా, బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ జేడీయూ.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. దీంతో బీజేపీతో కొనసాగించిన సుదీర్ఘ అనుబంధానికి తెరపడింది. ఓ వైపు నరేంద్ర మోడీ ప్రభంజనంతో బీజేపీ దూసుకుపోతుండటం.. మరో వైపు ఆర్జేడీ కూటమి మోహరించడం.. వెరసీ జేడీయూకు బీహార్‌లో సవాల్ ఎదురు కానుంది.