153 కేజీల సమోసా
ఆహా ఏమి రుచి.. తినరా సమోసా మైమరచి.. అంటూ బ్రిటన్ వాసులు పాడేసుకుంటున్నారు. కాస్త కరకరలాడుతూ, కాస్త మెత్తమెత్తగా ఉండే సమోసాకు బ్రిటన్ వాసులు ఫిదా అయిపోయారు. ఏకంగా సమోసా వారోత్సవాలనే నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 9 నుంచి 13 వరకు యూకేలోని ఆరు నగరాల్లో జాతీయ సమోసా వారోత్సవాలు జరిగాయి. అందులో సమోసా ఈటింగ్ పోటీలు, ఉత్తమ సమోసాకు అవార్డులు, కొత్త కొత్త సమోసా రెసీపీల పరిచయం వంటి కార్యక్రమాలూ జరిగాయి. కేవలం ఆలూ సమోసాయే కాదు ఉల్లి, బఠాణి, పంజాబీ చోలే సమోసా, హైదరాబాదీ కీమా సమోసా వంటి 20 రకాల సమోసాలెన్నో అందుబాటులో ఉన్నాయి. అసలు ఈ సమోసా చుట్టూ అల్లుకున్న వింతలు, విశేషాలు ఎంతో ఆసక్తికరం.. అవేమిటో తెలుసుకుందామా?
- సమోసా అంటే మనందరికీ ఇష్టమే. అయితే ఇది భారతీయ వంటకం కాకపోవడం గమనార్హం. పదో శతాబ్దానికి ముందు మధ్య ప్రాచ్య దేశాల్లో సమోసా పుట్టింది. అక్కడి నుంచి మధ్య ఆసియా దేశాల మీదుగా 14వ శతాబ్దంలో భారత్‌కు పరిచయమైంది. అంతే అప్పట్నుంచి భారతీయుల మెనూలో శాశ్వతంగా చేరిపోయింది.
- సమోసా అన్న పదం పర్షియన్ భాషలోని సంబోసాగ్ అన్న పదం నుంచి వచ్చింది. అఫ్గాన్లు సంబోసా అని పిలిస్తే, తజికిస్తాన్‌లో సంబూసా అని, టర్కీలో సంసా అని అంటారు.
- మొఘల్ చక్రవర్తి అక్బర్ నుంచి.. ఇప్పటి అబ్దుల్ కలామ్ వరకు ఎందరో ప్రముఖులు సమోసా రుచికి మైమరచిపోయిన వారే. అక్బర్ తన రాజధాని ఫతేపూర్ సిక్రీలోని ఒక భవనానికి ఏకంగా సమోసా మహల్ అని పేరు పెడితే... భారత్‌కున్న బలాల్లో సమోసా కూడా ఒకటంటూ కలాం తన అడ్వాంటేజ్ ఇండియా పుస్తకంలో శ్లాఘించడం గమనార్హం.
- చరిత్రలోనే కాదు.. అంతరిక్షంలోనూ సమోసా ఘుమఘుమలాడిపోయింది. వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు తన వెంట తీసుకువెళ్లిన ఆహార పదార్థాల్లో సమోసా కూడా ఉంది.
- సమోసా చిరు తిండా లేదా ఒక వంటకమా అన్న అంశంపై వివాదం నెలకొని కోర్టుకు కూడా చేరింది. ఉత్తరాఖండ్‌లో ఒక దుకాణదారు సమోసా అన్నది చిరుతిండేనని, అందువల్ల దానిపై పన్ను ఐదు శాతం మాత్రమే ఉండాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ వాణిజ్య పన్నుల శాఖ అదొక వంటకమని, దానిపై ఎనిమిది శాతం పన్ను ఉండాలంటూ వాదించింది. చివరికి న్యాయస్థానం సమోసా చిరుతిండి కాదని తేల్చేసింది.
- ఇక సమోసా పేరు చెబితే బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పేరు చటుక్కున గుర్తుకొస్తుంది. ‘జబ్‌తక్ రహేగా సమోసామే ఆలూ.. తబ్‌తక్ బిహార్‌లో రహేగా లాలూ (సమోసాలో ఆలూ ఉన్నంతకాలం.. బిహార్‌లో లాలూ ఉంటారు)’అంటూ ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు గుర్తుండిపోతాయి మరి. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అదే లాలూ మిత్రపక్షంగా ఉన్నప్పుడు బిహార్‌లో నితీశ్‌కుమార్ ప్రభుత్వం సమోసాలపై 13.5 శాతం లగ్జరీ పన్ను విధించింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
- గతేడాది కొందరు సమోసా ప్రియులు లండన్‌లో 153 కేజీల అతి పెద్ద సమోసాను తయారు చేసి గిన్నిస్‌బుక్ రికార్డు సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment