పట్నాలో కన్హయ్యకు ఘనస్వాగతం
పట్నా: జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌కు ఆయన స్వరాష్ట్రమైన బిహార్‌లో శనివారం రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. రాజద్రోహం కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయనకు నితీశ్ కుమార్ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. ఢిల్లీ నుంచి పట్నా విమానాశ్రయానికి చేరుకున్న ఆయన పోలీసుల రక్షణలో నగరంలోకి చేరుకున్నారు. సీఎం నితీశ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌లతో వారి నివాసాల్లో భేటీ అయ్యారు.
తర్వాత బేగుసరాయ్ జిల్లాలోని తనింటికి వెళ్లారు. కాగా, రాజద్రోహం అభియోగాలున్న కన్హయ్యకు ప్రభుత్వం ఘన స్వాగతం పలకడం రాష్ట్రానికి సిగ్గుచేటని విపక్ష బీజేపీ ఆరోపించింది. అయితే రాష్ట్రవాసి అయిన కన్హయ్యపై ఢిల్లీలో దాడి జరిగిందని, ఆయనకు లోపరహిత భద్రత కల్పించం తప్పుకాదని రాష్ట్ర మంత్రి, అశోక్ చౌధురి అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలో అసహనం పెరిగిందని కన్హయ్య ఆరోపించారు.అఫ్జల్ ఉరితీతకు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించి జేఎన్‌యూ తనకు వేసిన రూ. 10వేల జరిమానాను చెల్లిస్తామని ముంబై మునిసిపల్ కార్మికులు చెప్పారని తెలిపారు. వారు రూ. 10వేలు సేకరించారని, అయితే జరిమానా కట్టబోమన్నారు.