పాట్నా: వచ్చే ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా కీలక వ్యాఖ్యలు చేశారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్ నేతృత్వంలోనే జేడీయూ బరిలోకి దిగనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు ఓ జాతీయ మీడియాతో సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం నితిష్ కుమార్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని తన భూజాలపై వేసుకొని నడిపించారని ప్రస్తావించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన నాయకత్వంలోనే ముందుకు సాగనున్నట్లు చెప్పారు. అందులో ఎలాంటి సందేహం లేదని తేల్చి చెప్పారు.
నితీష్ రాజకీయాల్లో పడిపోతున్నారని అనుకున్న ప్రతీసారి అతను తన అద్భుతమైన పనితనంలో పునరాగమనం చేసి అందరిని ఆశ్యర్యపరుస్తుంటారని తెలిపారు. నితీష్‌పై ప్రజలకు ఇంకా నమ్మకం ఉందని చెప్పేందేకు లోక్‌సభ ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏకంగా 177 స్ధానాల్లో ఎన్డీయేకు స్పష్టమైన ఆధిక్యం లభించిందని గుర్తుచేశారు. కాగా ఈ ఏడాది జనవరిలో ఇండియా కూటమి నుంచి ఎన్డీయేలోకి మారిన నితిష్ కుమార్ బీహార్ లోక్‌సభ ఎన్నికల్లో 12 సీట్లు సాధించి 'కింగ్‌మేకర్'గా అవతరించారు.
'బీహార్‌కు ప్రత్యేక హోదాపై సంజయ్ కుమార్ ఝా మాట్లాడుతూ, 2004 నుండి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భాగస్వామిగా ఉన్న ప్రతిపక్షం బిహార్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని ఎప్పుడూ లేవనెత్తలేదు. ప్రత్యేక హోదా గురించి వారు కనీసం ఒక్కసారి కూడా డిమాండ్ చేయలేదు.
మేము మాత్రం మొదటినుంచీ ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నాం. ఈ విషయంలో సీఎం నితీష్ కుమార్ నిబద్ధతతో కృషి చేస్తున్నారు. భవిష్యత్‌లో బిహార్‌కు కొద్దిపాటి ఊతం లభించినా తాము కూడా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబడతాం. ప్రత్యేక హోదా విషయంలో అవరోధాలు ఏమైనా ఉంటే ప్రత్యేక ప్యాకేజ్ అయినా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై రాజకీయాలు చేయకూడదు'. ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment