ఢిల్లీ: విపక్ష కూటమి ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) శనివారం కీలక సమావేశం నిర్వహించనుంది. ఉదయం 11.30 సమయంలో వర్చువల్‌గా 26 పార్టీలు సమావేశం కానున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీట్ల పంపకాలు అనే అంశం ప్రధానంగా ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కూటమికి కన్వీనర్ ఎవరనేది కూడా రేపే ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
గత రెండు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. ఈసారి మొత్తం 543 లోక్‌సభ సీట్లలో కేవలం 255 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది కాంగ్రెస్. బీజేపీ ఓటమి లక్ష్యంగా.. కూటమిలోని ఇతర పార్టీల కోసం సీట్లను త్యాగం చేసే యోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. అదే జరిగితే స్వాతంత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ అత్యల్ప స్థానాల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి అవుతుంది. అంతకు ముందు 2004లో కాంగ్రెస్ 417 సీట్లకు పోటీ చేసింది.అయితే..
ఇండియా కూటమిలో ప్రాంతీయ పార్టీలు ఆధిపత్య ధోరణి ప్రదర్శించే క్రమంలో.. సీట్ల పంపకాల ప్రక్రియను ముందుకు సాగడం లేదు. పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, బీహార్‌లో కాంగ్రెస్ వైఫల్యాన్ని సాకుగా చూపించి.. కాంగ్రెస్‌తో సీట్ల షేరింగ్‌కు అక్కడి పార్టీలు అయిష్టత చూపుతున్నాయి. బెంగాల్‌లో దక్షిణ మాల్దా, బహరాంపూర్ స్థానాల్ని వదులుకునేందుకు టీఎంసీ సుముఖంగా కనిపించడం లేదు. అదే విధంగా బీహార్ నుంచి జేడీయూ-ఆర్జేడీ కూటమి కూడా ఇదే తరహా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఆప్ సైతం కాంగ్రెస్‌కు సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా లేదనే సంకేతాలు ఇస్తోంది. దీంతో.. రేపటి సమావేశంపై ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment