జార్ఖండ్‌లో ఎన్నికల సమరం మొదలైంది. 82 స్థానాల్లున్న రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 13, 20 రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. భాగస్వామ్య పక్షాలతో సీట్ల పంపకం, అభ్యర్థుల ఎన్నికల, ప్రచారాలపై పార్టీలన్నీ నిమగ్నమయ్యాయి. అధికారమే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష కూటమిలు పావులు కదుపుతున్నాయి. తాజాగా అసెంబ్లీ ఎన్నికలకు ఇండియా కూటమి మిత్రపక్షాల మధ్య సీట్ల షేరింగ్ ఫార్మూలా పూర్తయ్యింది.
ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) 43 స్థానాల్లో పోటీ చేయనుంది. కాంగ్రెస్ 30 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టనుంది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఆరు స్థానాల్లో పోటీ చేయనుండగా, వామపక్షాలు మూడు స్థానాల్లో ( నిర్సా, సింద్రీ, బగోదర్) పోటీ చేయనున్నాయి.
అయితే ధన్వర్, బిష్రాంపూర్, ఛతర్‌పూర్‌లోని మూడు స్థానాల్లో సీపీఐ-ఎంఎల్‌తో జేఎంఎం స్నేహపూర్వకంగా పోరాడుతుందని జేఎంఎం ప్రధాన కార్యదర్శి వినోద్ పాండే తెలిపారు. మరోవైపు ధన్వార్‌లో బీజేపీ తమ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బాబూలాల్ మరాండీని బరిలోకి దింపింది. జార్ఖండ్‌లోని 82 మంది సభ్యుల అసెంబ్లీకి నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఇదిలా ఉండగా జేఎంఎం ఇప్పటికే తమ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బర్హెట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయగా, ఆయన భార్య కల్పనా ముర్ము సోరెన్ గాండే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి కలిసే పోటీ చేస్తుందని, మొత్తం 82 స్థానాలకు గాను 70 స్థానాల్లో కాంగ్రెస్, జేఎంఎంలు అభ్యర్థులను నిలబెడతాయని సోరెన్ గతంలోనే చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment