
సాక్షి, నిర్మల్: ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీల్లో సీట్ల పంచాయితీ మొదలైంది. టికెట్ ఇస్తారో లేదోనని కొందరు, స్థానికంగా తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఓటమి తప్పదని మరికొందరు పార్టీలు మారుతుండటం సహజం. కానీ, మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వేరే పార్టీలోకి వెళ్తున్నారనే సమాచారం మాత్రం పెద్ద వార్తే అవుతుంది.
తాజాగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇంద్రకరణ్‌రెడ్డి కమలం పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి తమ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేశారని, ఆ మేరకు తనవద్ద ఆధారాలు ఉన్నాయన్నారు మహేశ్వర్ రెడ్డి.
(మైనార్టీలకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి హరీశ్‌రావు, త్వరలో జీవో!)
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆయన గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన స్నేహితుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారన్నారు. కావాలంటే తనవద్ద రుజువులు ఉన్నాయన్నారు. బీజేపీలో చేరితే ఇంద్రకరణ్‌రెడ్డికి ముథోల్ టిక్కెట్ ఇప్పిస్తామన్నారు. కానీ, ఇతరులపై విమర్శలు చేయవద్దని మంత్రికి మహేశ్వర్ రెడ్డి సూచించారు. ఓటమి తప్పించుకోవడానికి మంత్రి దారులు వెతుకున్నారని మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
(అనాగరిక చర్య.. విచారకరం: మణిపూర్ ఘటనపై కేటీఆర్ స్పందన)