విజయవాడ బుద్ధా వెంకన్న కార్యాలయం వద్ద నినాదాలు చేస్తున్న టీడీపీ కార్యకర్తలు
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపీ కేశినేని నానిని నియమించడంపై ఆ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో బుద్ధా వెంకన్న, నాగూల్‌మీరా పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. అయితే వారిని పక్కన పెట్టి నియోజకవర్గ సమన్వయకర్తగా కేశినేని నానిని నియమించడంపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. నియామక ఉత్తర్వులు వెలువడిన వెంటనే బుద్ధా వెంకన్న కార్యాలయానికి ఆయన అనుచరులు చేరుకున్నారు. నాని నియామకానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ పరిణామం ప్రస్తుతం టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది.
చదవండి: (‘అంతుచూస్తాం.. దిక్కున్న చోట చెప్పుకో’.. రెచ్చిపోయిన టీడీపీ నేతలు)
తారస్థాయికి వర్గపోరు..
టీడీపీలో కేశినేని నాని, బుద్ధా వెంకన్న, నాగూల్‌మీరా, బొండా ఉమా వర్గాల మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు సాగుతోంది. నాయకులు, కార్యకర్తలు సామాజిక వర్గాల వారీగా చీలిపోయారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా కేశినేని నాని కుమార్తె శ్వేతను ఏకపక్షంగా ప్రకటించడంతో వర్గ విభేదాలు మరోసారి రాజుకున్నాయి. దీంతో సాక్షాత్తూ చంద్రబాబు నాయుడు పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం చేసినా.. టీడీపీ చిత్తుగా ఓడిపోయింది.
దిగొచ్చిన చంద్రబాబు..
ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని.. తన కుమార్తెను కూడా టాటా కంపెనీలో ఉద్యోగానికి పంపుతున్నానని ఎంపీ కేశినేని ప్రకటించారు. ఎంపీ కార్యాలయంలో చంద్రబాబునాయుడి ఫొటోను తొలగించారు. ఆ తర్వాత అనుహ్య పరిణామాలతో కేశినేని మళ్లీ చంద్రబాబుకు దగ్గరయ్యారు. దీంతో నియోజకవర్గంపై ఆయనకు పెత్తనం అప్పగించారు. అయితే కొంత కాలంగా అక్కడ పార్టీ బాధ్యతలు చూస్తున్న బుద్ధా వెంకన్నకు మాత్రం అవమానమే మిగిలింది.
చదవండి: (టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. మంగళగిరికి చేరిన పంచాయితీ)
అత్యవసర సమావేశం..
ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, తమ నేతలకు అన్యాయం జరిగిందని హడావుడిగా బుద్ధా వెంకన్న కార్యాలయంలో సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. సమన్వయకర్తగా నాని వద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే బాధ్యతలు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment