ముంబై: సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం.. అంటే 2019 నవంబర్ 23న మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో ముఖ్యమంత్రిగా, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్‌తో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయం 8 గంటలకు రాజ్‌భవన్‌లో హడావుడిగా కొద్దిమంది సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కానీ, ఫడ్నవీస్ ప్రభుత్వం కేవలం దాదాపు 80 గంటలే మనుగడ సాగించింది. నవంబర్ 26న కుప్పకూలింది.
రెండు రోజుల తర్వాత.. నవంబర్ 28న శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నవంబర్ 22–23 అర్ధరాత్రి జరిగిన పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాయి. శివసేన తన మిత్రపక్షం బీజేపీ నుంచి దూరమయ్యింది. మూడు దశాబ్దాల అనుబంధాన్ని తెంచేసుకుంది. సైద్ధాంతికంగా శత్రువులుగా భావించే కాంగ్రెస్, ఎన్సీపీతో జట్టుకట్టింది. మూడు పార్టీలతో మహా వికాస్ అఘాడీ పేరిట కొత్త కూటమి ఏర్పాటయ్యింది. కొత్త ప్రభుత్వాన్ని నెలకొల్పింది.
మహారాష్ట్రలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. ఎన్నికల తర్వాత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఐదేళ్లపాటు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఉమ్మడిగా ప్రయాణం సాగించాయి. 2019లో కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో విజయం సాధించాయి. ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ–శివసేన మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. సీఎం పోస్టు తమకే దక్కాలంటూ ఇరుపక్షాలు భీష్మించుకు కూర్చున్నాయి. శివసేన పట్టు వీడకపోవడంతో బీజేపీ పాచిక విసిరింది.
ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ బీజేపీ గూటికి చేరారు. దాంతో ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది. దాదాపు మూడు రోజుల వ్యవధిలోనే బీజేపీకి రాంరాం అంటూ మళ్లీ శరద్ పవార్‌కు జై కొట్టారు. పవార్ మంత్రాంగంతో శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి పురుడు పోసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. రెండున్నరేళ్ల పాటు సాఫీగా సాగిన ప్రయాణంలో హఠాత్తుగా సంక్షోభం తలెత్తింది. చివరకు ఉద్ధవ్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment