న్యూఢిల్లీ: 39 మంది కేంద్ర మంత్రులు నిర్వహించిన జన్ ఆశీర్వాద యాత్రకు దేశవ్యాప్తంగా లభించిన జనాదరణను చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోయాయని, ఆయా పార్టీల్లో వణుకు పుట్టిందని బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా అన్నారు. విజయవంతంగా సాగుతున్న ఈ యాత్రకు ఆటంకాలు సృష్టించేందుకు ప్రతిపక్ష నాయకులు కుటిల యత్నాలు చేశారని మండిపడ్డారు. ఈ మేరకు నడ్డా శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి దేశ ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని తెలిపారు.
ప్రజామోదం నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాల కుట్రలు సాగడం లేదన్నారు. కేంద్ర మంత్రి నారాయణ రాణే పట్ల మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నడ్డా తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో ఉన్న కేంద్ర మంత్రిని అరెస్టు చేయడం అంటే మన ప్రజాస్వామ్యం వ్యవస్థపై నేరుగా దాడి చేసినట్లేనని ఉద్ఘాటించారు. ప్రతిపక్షాల ప్రతికూల రాజకీయ అజెండాను ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారని, అభివృద్ధి రాజకీయాలే వారు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
జన్ ఆశీర్వాద యాత్ర స్వాతంత్య్రోత్సవ దినం సందర్భంగా ఆగస్టు 15న మొదలయ్యింది. ఆగస్టు 28న ముగిసింది. కేంద్ర మంత్రులు 14 రోజుల్లో 24 వేల కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగించారు. 5 వేలకుపైగా సభల్లో మాట్లాడారు. యాత్రతోపాటు ఈ సభలన్నీ పూర్తిస్థాయిలో విజయవంతం అయ్యాయని జె.పి.నడ్డా వెల్లడించారు. ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని గుర్తుచేశారు. మోదీ నాయకత్వంలో జరుగుతున్న సర్వతోముఖా భివృద్ధిని ప్రజలు ప్రశంసిస్తున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం వినూత్న పథకాలు, కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలకు చేరువవుతోందని అన్నారు. దేశ భద్రతను పటిష్టం చేసేందుకు కేంద్ర ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. సమాజంలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం, బీజేపీ కట్టుబడి ఉన్నాయని వివరించారు. అభివృద్ధి విషయంలో వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment