సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన రాష్ట్ర రైతాంగానికి స్వర్ణ యుగమని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం పురోగతి–రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు’పై శాసన మండలిలో శుక్రవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో పలువురు ఎమ్మెల్సీలు మాట్లాడిన అనంతరం మంత్రి గోవర్ధన్ బదులిచ్చారు. వ్యవసాయం దండగ అని చంద్రబాబు అంటే.. కాదు పండగ అని నిరూపించిన ఘనత మహానేత వైఎస్సార్‌దని, తర్వాత ఈ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని చెప్పారు. ఇచ్చిన హామీకి కట్టుబడి వైఎస్సార్ రైతులకు పూర్తిగా రుణమాఫీ చేశారన్నారు. అదే హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రుణమాఫీకి కోతలు వేసి రైతులను దగా చేశారని తెలిపారు.
ఉచిత విద్యుత్తు ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవడానికే పనికొస్తుందని వెటకారం చేసిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. వైఎస్సార్ అందించిన ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తూ సీఎం వైఎస్ జగన్ వ్యవసాయానికి మరింత శక్తినిచ్చేలా 9 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నారని వివరించారు. సీఎం జగన్ ప్రభుత్వం రైతులకు, కౌలు రైతులకు కూడా అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని చెప్పారు. కోవిడ్ సంక్షోభ సమయంలో అమెరికా, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం చేతులెత్తేస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలను, రైతులను ఆదుకొని సీఎం జగన్ పెద్ద మనస్సు చాటుకున్నారని గుర్తు చేశారు.
వ్యవసాయంలో ఈ క్రాప్ బుకింగ్, రైతు భరోసా కేంద్రాలు, ప్రకృతి వ్యవసాయం, బీమా వంటి కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. ఆర్బీకేలు అనేక జాతీయ అవార్డులతోపాటు ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయని తెలిపారు. వ్యవ సాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశుసంవర్థక, డెయిరీ, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, వైఎస్సార్ జలకళ, ఉచిత విద్యుత్ వంటి చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని మంత్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment