న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కుమారుడికి క్షమాపణలు చెప్పారు. దోవల్ కుమారుడు వివేక్ దోవల్‌పై జైరాం రమేశ్ 2019 జనవరిలో ఓ మేగజైన్‌లో వచ్చిన ఆర్టికల్‌ను అనుసరించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు పత్రికా ప్రకటనల్లోనూ అదే తరహా విమర్శలు గుప్పించారు. దీంతో తమపై నిరాధార ఆరోపణలు చేసిన జైరాం రమేశ్‌పైనా, సదరు మేగజైన్ నిర్వాహకులపైనా వివేక్ పరువు నష్టం దావా వేశారు. ఉన్నత స్థానంలో ఉన్న తన తండ్రిని అపఖ్యాతి పాలు చేయాలని చూస్తున్నారని కోర్టుకు విన్నవించారు. తాజాగా దావాకు సంబంధించి జైరాం రమేశ్ స్పందించారు.
ఎన్నికల ప్రచార వేడిలో అప్రయత్నంగా వివేక్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశానని అన్నారు. తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా భంగపరిచి ఉంటే దానికి చింతిస్తున్నానని ప్రకటనలో పేర్కొన్నారు. వివేద్ దోవల్‌కు, అతని కుటుంబ సభ్యులకు సారీ చెబుతున్నానని అన్నారు. గతంలో వివేక్‌పై తన వ్యాఖ్యలకు సంబంధించిన ప్రకటనలు ఏవైనా ఉంటే అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ను కోరారు. కాగా, రమేశ్ క్షమాపణల్ని అంగీకరిస్తున్నామని వివేక్ దోవల్ ఓ జాతీయ మీడియాతో అన్నారు. రమేశ్‌పై వేసిన పరువు నష్టం దావాను వెనక్కి తీసుకుంటున్నామని తెలిపారు. అయితే, తప్పుడు వార్తలు రాసిన కారవాన్ మేగజైన్‌పై మాత్రం దావా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment